ఉద్యోగ విరమణ తర్వాత సమయం గడువడానికి ఏదో ఒకటి చేస్తుంటారు చాలామంది. అలాగే ఒక రిటైర్డ్ న్యాయవాది ఇంటి బాల్కనీలో సుమారు 10వేలకు పైగా మొక్కలు నాటాడు. ప్రకృతి తనను కుర్రాడిలా భావించే ఆయన స్టోరీ ఇది.. కలకత్తాకు చెందిన రిటైర్డ్ న్యాయవాది పార్థసారథి గంగోపాధ్యాయ 2015 నుంచి పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నంలో ఉన్నాడు. తన పరిసరాల్లో చెట్లను నాటుతున్నారు. డమ్ డమ్ స్టేషన్ నుంచి పది నిమిషాల నడిస్తే సరిపోతుంది. అక్కడ సెవెన్ ట్యాంక్స్ లేన్ చూసి కచ్చితంగా షాకవుతారు. ప్లాస్టిక్ వ్యర్థాల్లో వేసిన మొక్కలు, చెట్లతో అలంకరించబడి ఉంటాయి.
మొక్కలే కాదు..
పార్థసారథి ఇంటి ముందుకు అడుగు పెట్టగానే.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా 10వేలకు పైగా మొక్కలు దర్శనమిస్తాయి. మట్టి తొట్టెల్లోనే కాకుండా.. ప్లాస్టిక్ సీసాలు, టిన్ డబ్బాలు, టైర్లు, టిన్ జాడీల్లో ఈ మొక్కలు నాటారు. ఈయన కేవలం మొక్కలు నాటడమే కాదు.. ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి దుర్గ, సరస్వతి, గణేశుడితో సహా.. చాలా దేవతల విగ్రహాలను సృష్టించాడు. ఉదాహరణకు దుర్గా మాత చేతులకు చిన్న సీసాలు, కళ్లు ప్లాస్టిక్ మూతలు, విరిగిన సీడీలతో ఆభరణాలను తయారుచేశాడు.
రోడ్డు మీద పడేసినవి..
పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో పార్థసారథి ఈ కార్యక్రమం చేయడం లేదంటున్నాడు. 2015లో పదవీ విరమణ చేసినప్పుడు ఖాళీ సమయంలో ఏం చేయాలని ఆలోచించాడు. గార్డెన్ లా చేయాలనుకున్నాడు. అలాగే చేశాడు కూడా. ‘నేను బయటకి వెళ్లినప్పుడు పారేసిన ప్లాస్టిక్ సీసాలు, టైర్లు ఎలా తెచ్చేవాడిని. ఇప్పుడు చుట్టు పక్కన ఉన్న వాళ్లు నా గురించి తెలిసి వాళ్లే తీసుకొచ్చి ఇస్తున్నారు. చాలామంది చెట్లు నాటడానికి స్థలం లేదని అంటుంటారు. అవన్నీసాకులు. నా ఇంటి ముందు ఉన్న కొంత ఖాళీ స్థలంలో నేను ఎన్ని చెట్లు నాటాను’ అంటున్నాడు పార్థసారథి.
పార్థసారథికి 1986లో ఒకసారి, 2012లో రెండుసారి వోకల్ కార్డ్ క్యాన్సర్ అటాక్ అయింది. దాదాపు మృత్యు ముఖం నుంచి తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఆ ప్రకృతే తనని రక్షిస్తుందని నమ్ముతాడు. చెట్లను నరికివేయడం గురించి, పర్యావరణ నాశనం వల్ల భవిష్యత్ తరాల జీవితాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాడీ పెద్దాయన.