Komatareddy Venkatareddy joked that he will also resign if there is development
mictv telugu

నేను కూడా రాజీనామా చేస్తా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి

August 13, 2022

Komatareddy Venkatareddy joked that he will also resign if there is development

కాంగ్రెస్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం కాకరేపుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పినా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు. అద్దంకి దయాకర్ ను శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాతే క్షమాపణల గురించి ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఉద్యమకారుడినైన నన్ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం చాలా బాధ కలిగించింది ’’ అని వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అద్దంకి దయాకర్ ను సస్పెండ్ చేస్తేనే… మునుగోడులో ప్రచారానికి వెళ్తానని తెలిపారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అంటే తమాషాగా అనిపిస్తుందా.. చిన్న పిల్లాడిలా అద్దంకి దయాకర్ మాట్లాడారని చెప్పారు. సారీ చెప్తే సరిపోదని కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ ను సస్పెండ్ చేయాల్సిందేనని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ..అద్దంకి దయాకర్ మరోసారి సారీ చెప్పారు. చండూరు బహిరంగ సభలో తాను మాట్లాడిన అభ్యంతరకర మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘నా నోటి నుంచి మరో సారి ఇలాంటి మాటలు రావు’ అని ఆయన హామీ ఇచ్చారు.

మరోవైపు మునుగోడులో ప్రచారానికి తనకు ఆహ్వానం లేదని పీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పిలవని పేరంటానికి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. తనను సంప్రదించకుండా కాంగ్రెస్ పెద్దలు కమిటీ వేశారని, మునుగోడు వ్యవహారం వాళ్లే చూసుకుంటారని కాస్త అసహనం వ్యక్తం చేశారు. తాను అసలు మునుగోడు వైపు పోనే పోనని, మునుగోడులో ఎవరు గెలుస్తారో తనకు ఎట్లా తెలుస్తాది అని రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు వెంకటరెడ్డి. మీడియా వెళ్లి సర్వే చేసి మునుగోడులో ఎవరు గెలుస్తారో తనకు చెప్పాలన్నారు. మునుగోడు ఎన్నికలను సెమీఫైనల్‌గా అభివర్ణించారు. పార్టీలోని ఐపీఎస్ లాంటి పెద్దలే మునుగోడులో గెలిపిస్తారని కామెంట్ చేశారు. రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందంటే తాను కూడా రాజీనామా చేస్తానని కోమటరెడ్డి వెంకటరెడ్డి చమత్కరించారు.