తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలను ఏర్పాటు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ కూడా ఒకటి. కాంగ్రెస్ కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తనపై పార్టీ మారుతున్నాడంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు కేసీఆర్ తన అనుకూల మీడియాతో ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా ఇటీవల కలిసిన మాట వాస్తవమేనన్నారు. గతంలో కూడా నల్గొండ జిల్లా సమస్యలపై పలుమార్లు కలిశానని స్పష్టం చేశారు. తన అభిమానులు, కార్యకర్తల్లో గందరగోళం సృష్టించి తర్వాత వారిని తనవైపు తిప్పుకోవాలనేదే కేసీఆర్ ప్రణాళిక అని స్పష్టం చేశారు. అంతేకాక, కింది స్థాయి నాయకులు, కార్యకర్తలను కొనేందుకు రాత్రికి రాత్రే డబ్బు సంచులు సర్దారని తెలిపారు. తన నియోజకవర్గాన్ని సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేటలతో సమానంగా అభివృద్ధి చేస్తే ఏ త్యాగానికైనా సిద్దపడతానని ప్రకటించారు.