కోమటిరెడ్డి, సంపత్‌కు శుభవార్త: రద్దును కొట్టేసిన హైకోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

కోమటిరెడ్డి, సంపత్‌కు శుభవార్త: రద్దును కొట్టేసిన హైకోర్టు

April 17, 2018

అనర్హత వేటు పడిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. వీరి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ అసెంబ్లీ వెలువరించిన గెజిట్‌ నోటిషికేషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని సాధారణం చెప్పే కోర్టు ఈ విషయంలో మాత్రం భిన్నంగా స్పందించింది. మార్చి 12న జరిగింది అసెంబ్లీ అంతర్గత వ్యవహారం కానేకాదు.. ఇది దేశానికి దిశానిర్దేశం చేసే తీర్పుల్లో ఒకటి అని వ్యాఖ్యానించింది.ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు నిర్ణయం చెల్లదని స్పష్టం చేసింది. వారిద్దరూ తమ పదవుల్లో కొనసాగొచ్చని జడ్డి తీర్పు చెప్పారు. సభ్యత్వాల రద్దు కారణం నల్లగొండ, అలంపూర్‌ స్థానాలు ఖాళీ అయ్యాయని ఎన్నికల సంఘానికి తెలంగాణ సర్కారు ఇచ్చిన లేఖ కూడా చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. మార్చి 12న బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగంపై విపక్షాలు నిరసన తెలపడం విదితమే.

వెంకట్‌రెడ్డి.. హెడ్‌సెట్‌ను పోడియం వైపు విసరగా, సంపత్‌ కుమార్‌ అందుకు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. హెడ్ సెట్.. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు తగిలిందని ప్రభుత్వం తెలిపింది. దీంతో కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాలను స్పీకర్ రద్దు చేశారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. సంఘటన జరిగిన నాటి అసెంబ్లీ సమావేశాల  వీడియోలన్నీ కోర్టుకు సమర్పించాలని కోరగా, అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో ఇద్దరికీ కోర్టు ఊరటనిచ్చింది.