నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు కుట్ర : కోమటి రెడ్డి వెంకట రెడ్డి
ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ విడివిడిగా మీడియాతో సమావేశమయ్యారు. ముందుగా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి ఈ నెల 8న స్పీకరుకు రాజీనామా చేస్తున్నానని, 21న జరిగే బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నానని ప్రకటించారు. తర్వాత వెంకటరెడ్డి మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. దాసోజు శ్రవణ్ లాంటి మేధావులను కూడా పార్టీ నుంచి బయటికి వెళ్లేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పాత నాయకులను పార్టీ నుంచి పంపించి టీడీపీ నుంచి వచ్చే వాళ్లతో పార్టీని నింపాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్ నాయకులు ఎవరైనా పీసీసీ అధ్యక్షుడి పక్కన ఉన్నారా? అని ప్రశ్నించారు. అంతేకాక, తన నియోజకవర్గంలో తనకే సమాచారం లేకుండా సభ నిర్ణయం ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు. అలాగే తనకు వ్యతిరేకంగా పనిచేసిన చెరుకు సుధాకర్ పార్టీలో చేరే విషయం ఎందుకు చెప్పలేదని నిలదీశారు. వీరి సంగతేందో సోనియా, రాహుల్ వద్దే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. మునుగోడు విషయం గురించి ప్రస్తావిస్తే.. అక్కడ ఎవరు గెలుస్తారో తనకు తెలుసు కానీ, ఇప్పుడే చెప్పనని దాటవేశారు. కాగా, తాజా రాజకీయ పరిస్థితులను చూస్తే కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి కొనసాగడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.