Komati Reddy Venkata Reddy who went to Gandhi Bhavan and met Revanth Reddy
mictv telugu

అనూహ్యం.. గాంధీభవన్ మెట్లెక్కి రేవంత్‌తో భేటీ అయిన కోమటిరెడ్డి

January 20, 2023

 

Komati Reddy Venkata Reddy who went to Gandhi Bhavan and met Revanth Reddy

శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గత కొద్ది నెలలుగా పార్టీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీభవన్‌లో ఎంట్రీ ఇచ్చారు. అక్కడ ఉప్పూ నిప్పులా భావించే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కాసేపట్లో రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రేతో భేటీ అయి పార్టీ పరిస్థితిపై చర్చించనున్నారు. కాగా, వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అతని రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక రాగా, వెంకటరెడ్డి తమ్ముడికే మద్ధతు ఇవ్వడంతో పార్టీలో విభేదాలు పొడచూపాయి.

అటు రేవంత్ రెడ్డితో నువ్వా? నేనా? అనే స్థాయిలో విభేదాలు రావడంతో నాలుగు సార్లు ఓడిపోయిన వారి పక్కన నేను కూర్చోవడమా? అని సంచలన కామెంట్ చేశారు వెంకటరెడ్డి. అంతేకాక, ఇక గాంధీ భవన్ మెట్లు ఎక్కనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్దలు జానారెడ్డి వంటి వారు ఎంత ప్రయత్నించినా సయోధ్య కుదరకపోవడంతో స్పందించిన అధిష్టానం.. అనేక కారణాల వల్ల ఇంఛార్జీని మార్చింది. ఇప్పుడు కొత్త ఇంఛార్జీ రావడంతో ఏం మార్పు కనపడిందో ఏమో కానీ గతంలో తాను అన్న మాటలను పక్కన పెట్టి గాంధీభవన్‌కి రావడం, రేవంత్ రెడ్డితో భేటీ కావడం పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు కొద్ది నెలలే సమయం ఉన్నందున అందరూ కలిసి కట్టుగా పని చేస్తే అధికారంలోకి రావచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు.