బండి సంజయ్, ఈటల రాజేందర్‌‌లే నన్ను ఓడించారు - రాజగోపాల్ రెడ్డి ఆవేదన! - MicTv.in - Telugu News
mictv telugu

బండి సంజయ్, ఈటల రాజేందర్‌‌లే నన్ను ఓడించారు – రాజగోపాల్ రెడ్డి ఆవేదన!

November 7, 2022

Rajgopal

మునుగోడు ఉప ఎన్నికల్లో తన ఓటమికి కారణం సొంత పార్టీ నాయకులేనని బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాపోయినట్టు తెలుస్తోంది. ఓటమి తర్వాత తొలిసారిగా తన కార్యకర్తలతో సోమవారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విషయాలు అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర అంశాలు చక్కర్లు కొడుతున్నాయి. తనను కావాలనే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్‌‌‌లు కలిసి ఓడించారని, తాను గెలిస్తే ఎక్కడ వారికి పోటీగా మారుతానేమోననే ఆందోళనకు గురయ్యారని అన్నట్టు సమాచారం.

అంతేకాక, ఎన్నికల్లో డబ్బు తరలింపుపై పోలీసులకు లీకులు ఇచ్చింది కూడా వారేనని, గ్రౌండ్ రిపోర్టు తనకు అనుకూలంగా లేదని అధిష్టానానికి తప్పుడు నివేదికలు ఇచ్చారన్నారు. ఆ విధంగా జేపీ నడ్డా బహిరంగ సభ పెట్టకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై బీజేపీ నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అసలు ఈ రూమరు ఎంత వరకు కరెక్ట్ అనేది తేలాల్సి ఉంది. ఏదిఏమైనా తప్పకుండా గెలుస్తానని భావించి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా ఓడిపోవడంపై తీవ్ర కలత చెందారని అక్కడి కార్యకర్తలు భావిస్తున్నారు.