Komatireddy Rajagopal Reddy Tried To Join Trs Party, says Minister KTR
mictv telugu

రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరతానని చెప్పాడు: మంత్రి కేటీఆర్

October 31, 2022

మునుగోడు ఉపఎన్నిక వేళ తెలంగాణలో ఊహించని రాజకీయ పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజుకో కొత్త విషయం బయటకొస్తోంది. తాజాగా.. మంత్రి కేటీఆర్ సంచలన విషయం బయటపెట్టారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీ గూటికి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. గతంలో టీఆర్ఎస్ (TRS) పార్టీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించారని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రాజగోపాల్ రెడ్డి మూడేళ్లుగా తీవ్రంగా ప్రయత్నించారని తెలిపారు. ‘మా పార్టీ నేతలతోనే కాదు.. స్వయంగా నాతో కూడా మాట్లాడారు. ఆయన చేరిక విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. కేసీఆర్ వారిని పార్టీలో చేర్చుకోవడానికి నిరాకరించారు. కోమటిరెడ్డి సోదరులకు నిలకడ ఉండదు.. మాట మీద నిలబడే నేతలు కాదు. గతంలో వైఎస్సార్‌ను, జగన్‌ను మోసం చేశారు. వారిని మనం నమ్మలేం అని కేసీఆర్ చెప్పారు. అందుకే వారిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదు’ అని కేటీఆర్ వెల్లడించారు.

వారు కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు.. కోవర్ట్ బ్రదర్స్ అని వ్యాఖ్యానించారు. ఈ ఉప ఎన్నికను మునుగోడు ప్రజలపై బలంగా రుద్దారని వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డి కేవలం కాసుల కోసమే కక్కుర్తిపడ్డారని ఆరోపించారు. ఆయన మూడేళ్లుగా అసలు నియోజకవర్గంలో పర్యటించలేదని స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంటే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక పార్టీలో ఉండి.. మరొక పార్టీ కోసం పనిచేయడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో.. ఈ వ్యవహారం చూస్తే అర్థం అవుతోందన్నారు.