కోమటిరెడ్డి దాష్టీకం.. మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తీవ్రగాయం - MicTv.in - Telugu News
mictv telugu

కోమటిరెడ్డి దాష్టీకం.. మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తీవ్రగాయం

March 12, 2018

తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు తొలిరోజు రసాభాసాగా మొదలయ్యాయి. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో విపక్ష కాంగ్రెస్‌ సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహంతో తన హెడ్‌సెట్‌ను విసిరికొట్టాడు. దీంతో అది మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి తగిలింది. గవర్నర్ ప్రసంగం ముగిసేవరకు స్వామిగౌడ్ అక్కడే ఉన్నారు. తర్వాత వెంటనే సరోజనినీ దేవి కంటి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కార్నియా దెబ్బతిందని, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. కోమటిరెడ్డి హెడ్‌ సెట్‌ విసిరేసిన దృశ్యాలు అసెంబ్లీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అంతకుముందు.. గవర్నర్ ప్రసంగం రొడ్డకొట్టుడుగా ఉందంటూ కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు.నన్నుకూడా కొట్టారు.. కోమటిరెడ్డి..

కాగా, ప్రజాస్వామ్యంలో ఎవరిరకైనా తమ నిరసన తెలిపే హక్కు ఉంటుందని.. అయితే ఇలాంటి దారుణ చర్యలు మాత్రం సరికాదని స్వామిగౌడ్‌ మండిపడ్డారు. గవర్నర్‌ ప్రసంగంలో రైతు సమస్యలపై కనీస ప్రస్తావన లేకపోవడంతో ఆందోళన చేశామని, తాను కొంత ఆవేశపడిన మాట నిజమేనని కోమటిరెడ్డి ఒప్పుకున్నాడు.  తాము స్పీకర్‌ పోడియం దగ్గరికి వెళ్లగా మార్షల్స్‌ తమను అడ్డుకున్నారని, తనను కొట్టారని చెప్పారు. ‘నా కాలికి గాయమైంది. ఎక్స్‌రే కూడా తీయించుకున్నాను.. టీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్రతిరోజూ స్పీకర్‌ పోడియం దగ్గరికి వెళుతున్నారు. ఇక్కడ మాత్రం నిర్బంధాలు ఎందుకు?’ అని ప్రశ్నించారు.

మందుకొట్టి వచ్చారు. .

కాంగ్రెస్ సభ్యుల్లో కొందరు మద్యం తాగి సభకు వచ్చారని అధికార టీఆర్ఎస్ ఆరోపించింది. విపక్షం సభ గౌరవాన్ని మంటగలిపారని అన్నారు.