Komatireddy Venkat Reddy decided that Revanth's apology was not acceptable
mictv telugu

సారీ చెప్తే సరిపోదు.. సస్పెండ్ చేయాల్సిందే: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

August 13, 2022

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇవాళ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. అయితే రేవంత్ క్షమాపణ అంగీకరించేది లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్టీ నుంచి అద్దంకి దయాకర్ ను సస్పెండ్ చేయాల్సిందేనన్నారు. సస్పెండ్ చేస్తేనే… మునుగోడులో ప్రచారానికి వెళ్తానని తెలిపారు. సారీ చెప్తే సరిపోదని కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పిన వెంటనే.. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కూడా మీడియా వేదికగా సారీ చెప్పారు. చండూరు బహిరంగ సభలో తాను మాట్లాడిన అభ్యంతరకర మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘నా నోటి నుంచి మరో సారి ఇలాంటి మాటలు రావు’ అని ఆయన హామీ ఇచ్చారు. పార్టీకి నష్టం జరగకూడదని మరోసారి క్షమాపణ చెబుతున్నట్టుగా వెల్లడించారు. క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చిందని.. వాటిపై రాతపూర్వకంగా క్షమాపణ కోరానని చెప్పారు. పార్టీతో కలిసి పనిచేసేందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందుకు రావాలని కోరారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పార్టీ చూసుకుంటుందని అన్నారు.

మరోవైపు మునుగోడులో ప్రచారానికి తనకు ఆహ్వానం లేదని పీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పిలవని పేరంటానికి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. పార్టీలోని ఐపీఎస్ లాంటి పెద్దలే మునుగోడులో గెలిపిస్తారని కామెంట్ చేశారు. పార్టీ నుంచి ఒక్కొక్కరిగా వెళ్తున్నా పట్టించుకోవడం లేదని.. తనను మునుగోడులో అనరాని మాటలు అనిపించారంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను హోంగార్డుతో పోల్చడం అత్యంత బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పార్టీ నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.