Komatireddy Venkat reddy hints on Bhuvanagiri Bhongir byelections by controversial attitude
mictv telugu

తెలంగాణలో మరో ఉపఎన్నిక.. భువనగిరి ఎంపీ సీటు ఖాళీ కానుందా?

October 26, 2022

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ‘అదంతా కేవలం కల్పితం, కట్టుకథ, నమ్మకండి,’ అని నాయక శిఖామణులు తోసిపారేసిన ఎన్నో పుకార్లు, వార్తలు, వదంతులు, ఆరోపణలు, అంచనాలు అక్షరాలా నిజమవుతుంటాయి. కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని గతంలో ఎన్నోసార్లు చెప్పిన మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాటకే తూచ్ కొట్టి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం తాజా ఉదాహరణ. తను చచ్చేంతవరకు హస్తాన్ని వీడే ప్రసక్తే లేదంటున్న ఆయన అన్న, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడి బాటలోనే నడవనున్నారా? మారుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని తగిన ‘పరిష్కారాలు’ వెతుక్కుంటున్నారా? పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా తను బలోపేతం కావడానికి ప్రయత్నిస్తున్నారా? ఆయన ఆడియో లీక్, కాంగ్రెస్ వ్యతిరేక వ్యాఖ్యలు, మునుగోడు ఎన్నికల విషయంలో ‘నిమ్మకు నీరెత్తినట్టు’ ఉంటూ భస్మాసుర హస్తంలా ప్రవర్తించడం, అధిష్టానం పంపిన నోటీసులు, వాటికి స్పందించకపోవడం వగైరా గమనిస్తుంటే తెరవెనక ఏదో జరుగుతోందని అనుమానించక తప్పదు..

బీజేపీకి కాబోయే ‘కాంగ్రెస్ చీఫ్’ ప్రచారం

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని వెంకట్ రెడ్డి ఓ కాంగ్రెస్ నేతతో మాట్లాడిన ఆడియో, ఓడిపోయే పార్టీకి ప్రచారం ఎందుకని చేసిన వ్యాఖ్యలు పైకి ‘ఏదో యథాలాపంగా’ మాట్లాడినవేం కావు. పీసీపీకి ప్రెసిడెంట్ కాబోతున్నానన్న ఆయన కాషాయాన్ని గెలిపించాలని కోరడం వెనక సోదరప్రేమతో పాటు స్వప్రయోజనాలు ఉన్నట్లు కనిపిస్తోందన్నది రాజకీయ నిపుణుల విశ్లేషణ. అంతర్గత ప్రజాస్వామ్యానికి అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన కాంగ్రెస్ పరిస్థితి, ప్రతిష్ట ఎంత దిగజారిపోతే అందులోని పార్టీలకు నాయకులకు అంత లాభం!

పొగపెట్టుంచుకుని మరీ..

ఆడియో లీక్‌తోపాటు గతంలో పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, వ్యవహారాలు వెంకట్ రెడ్డి రేపోమాపో కాంగ్రెస్‌ను వీడడం ఖాయమనే సంకేతాలిస్తున్నాయని పరిశీకుల అంచనా. పార్టీ నుంచి తను వెళ్లిపోకుండా, పార్టీ చేతనే పొగపెట్టించుకుని పోవాలన్న వ్యూహంలో భాగంగా చాలామంది చేసే పనే ఆయనా చేస్తున్నట్లు కనిపిస్తోందటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారడం, రేవంత్ రెడ్డి ఆధిపత్యం కింద తాము పైకొచ్చే పరిస్థితి లేకపోవడంతో వెంకట్ రెడ్డితోపాటు మరికొందరు నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఇది కేవలం తెలంగాణ కాంగ్రెస్‌కు మాత్రమే పరిమితం కాదు. దాసోజు శ్రవణ్ వంటి ఇక్కడి నేతలైనా, గులాం నబీ ఆజాద్ వంటి ఉత్తరాది నేతలైనా కాంగ్రెస్‌పై నిరాశతో, భవిష్యత్తుపై ఆశతో వెళ్లిపోతున్నారు. కోమటిరెడ్డి తాజా ‘సంచలనాలు’, ‘లీకులు’ కూడా అందులో భాగమనే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రజల్లో తనకున్న పట్టును నిరూపించుకోడాకి కాలం ఇలాంటి అవకాశాలు కల్పిస్తుంటుందని, కల్పించకపోయినా స్వయంగా కల్పించుకోవాలన్నది నేటి రాజకీయం. పుకార్లు, వదంతులు, ఆరోపణలు అని కొన్నిపడేసిన ఎన్నో విషయాలు కొద్ది రోజులు గడవకముందే నిజమవుతున్న నేపథ్యంలో వెంకట్ మనసులో ఉన్నదేదో ఫలిస్తే తెలంగాణలో మరో ఉప ఎన్నిక రావడం ఖాయం.