కొంపముంచిన ప్రేమ పెళ్లి.. రాజకీయ దుమారం - MicTv.in - Telugu News
mictv telugu

కొంపముంచిన ప్రేమ పెళ్లి.. రాజకీయ దుమారం

April 14, 2022

9

కేరళ రాష్ట్రంలో ఓ యువతి, యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంఘటన తీవ్రమైన విమర్శలకు దారితీసింది. అంతేకాకుండా ఆ రాష్ట్రంలోని రాజకీయాలలో దుమారం రేపింది. కోజికోడ్‌లో సీపీఎం యువజన విభాగానికి చెందిన డీవైఎఫ్ నాయకుడు పిజిన్ అనే ముస్లిం యువకుడు వేరొక మతానికి చెందిన జ్యోత్స్న మేరీ జోసెఫ్‌ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ పెళ్లి చేసుకున్న జ్యోత్స్న ఈనెల 10వ తేదీన తల్లిగారి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో లవ్ జిహాద్ అనే పేరుతో తమ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడని, మిస్సింగ్ కేసు పెట్టారు. తమ కుమార్తెను కోర్టు ముందు హాజరుపరచాలని, కేరళ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

దీంతో అప్రమత్తమైన అధికారులు జ్యోత్స్నను, పిజిన్‌ను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. తమ కుమార్తెను ఇంటికి పంపించాలని తల్లిదండ్రులు కోర్టును వేడుకున్నారు. దానికి జ్యోత్స్న.. తాను తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి సిద్ధంగా లేనని తేల్చి చెప్పింది. దీంతో హైకోర్టు ఆ యువ జంటను విడుదల చేసింది.

మరోవైపు ఈ వ్యవహారంపై సీపీఎం కోజికోడ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జార్జ్ ఎం థామస్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. “లవ్ జిహాద్ అనేది నిజం. ఎడీపీఐ, జమాత్ ఏ ఇస్లామీ వంటి సంస్థలు బాగా చదువుకున్న ఇతర మతాల యువతులను ట్రాప్ చేసి, లవ్ జిహాద్‌కు పాల్పడేలా ప్రోత్సహిస్తాయి. షిజిన్.. జ్యోత్స్నను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ముందే ఆ విషయాన్ని పార్టీకి తెలియజేయాల్సింది.

దీని వల్ల ఈ ప్రాంతంలో పార్టీకి మద్దతుగా ఉండే వర్గం దూరమయ్యే పరిస్థితి వచ్చింది” అని థామస్ వ్యాఖ్యానించారు. దీంతో సీపీఎంపై ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యలో ఫిజిన్, జ్యోత్స్న మాట్లాడుతూ.. ‘మాది లవ్ జిహాద్ కానే కాదు. జీవితాంతం నేను మా మతంలోనే కొనసాగుతా. షిజిన్ ఇందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు” అని జ్యోత్స్న వివరణ ఇచ్చింది.