కమలంలోకి కొండా సురేఖ!
తెలంగాణకు చెందిన సీనియర్ నేత కొండా సురేఖ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. బీజీపీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. కొందరు నేతలు బీజేపీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఆమెను సంప్రదించడం, కొండా సురేఖ సైతం సానుకూలంగా స్పందించారని సమాచారం. ఈ మేరకు చర్చలు పూర్తయినట్లు.. త్వరలోనే ఆమె కమలం కండువా కప్పుకోనున్నట్లు చెప్తున్నారు.
ముందస్తు ఎన్నికల్లో భాగంగా ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో టికెట్ దక్కకపోవడంతో ఆమె నిరాశకు గురైన విషయం తెలిసిందే. దీంతో మనస్తాపం చెందిన సురేఖ టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. అనంతరం తన భర్త కొండా మురళితో కలిసి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో సురేఖ సమావేశం అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేయగా ఓటమి పాలయ్యారు. అయితే, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో సురేఖ క్రియాశీలంగా పాల్గొనడం లేదు. మరోవైపు పార్టీ తరఫునా పెద్దగా కార్యక్రమాలు కూడా జరగడం లేదు. ఇదే సమయంలో ఆమె మనసు మార్చుకుని బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.