బీజేపీలో చేరుతున్నట్లు తనపై కొన్నాళ్లు సాగుతున్న ఊహాగానాలు నిజమేనని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. కాషాయ తీర్థం పుచ్చుకోడానికి కారణాలను కూడా వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోయిందని, టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. ఆయన గురువారం తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ హవా బావున్నప్పుడు రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించి ఉంటే ఆ పార్టీలోనే ఉండేవాడినంటూ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు.
తెలంగాణలోనే కాకుండా దేశమంతటా కాంగ్రెస్ బలహీనపడిందని కొండా అన్నారు. ‘సకాలంలో రేవంత్ రెడ్డికి పీసీపీ పదవి ఇచ్చివుంటే అందులోనే ఉండేవాడిని. తెలంగాణలో కేసీఆర్ నియంత పాలన సాగుతోంది. ఆయన తెలంగాణవాదులను మోసం చేశారు. పువ్వాడ, తలసాని, సబితలను పక్కన చేర్చుకున్నారు. టీఆర్ఎస్తో తలపడే సత్తా ఒక్క బీజేపీకే ఉంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. అది క్రమశిక్షణ గల పార్టీ కేసీఆర్ వ్యతిరేక ఓట్లను బీజేపీకే పడతాయి. నేను పదవుల కోసం బీజేపీలో చేరడం లేదు. నేను బీజేపీలో ఎక్కడ, ఎప్పుడు చేరాలో కిషన్ రెడ్డి బండి సంజయ్ నిర్ణయిస్తారు. కాంగ్రెస్ పట్ల నమ్మకం పోవడంతోనే బీజేపీలో చేరున్నా..’’ అని కొండా చెప్పారు.