Konda Vishweshwar Reddy, Tula Uma denied news of party change
mictv telugu

టీఆర్ఎస్‌లోకి… విశ్వేశ్వర్ రెడ్డి, తుల ఉమ క్లారిటీ

October 21, 2022

Konda Vishweshwar Reddy, Tula Uma denied news of party change

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దూకుతున్నారు. దీంతో ఏ క్షణంలో ఏ నాయకుడు ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో కొందరు నాయకులు పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్ తిరిగి టీఆర్ఎస్‌లోకి వస్తున్నట్టు, మంత్రి హరీష్ రావు బీజేపీలోకి వెళ్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఏది నిజం, ఏది అబద్ధం అనే గందరగోళం నెలకొంది. చివరకి ఇదంతా ఫేక్ అని నిరూపితమవుతోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కరీంనగర్‌కు చెందిన తుల ఉమలు కూడా అధికార పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై వారి వివరణ కోరగా, ప్రచారాన్ని ఖండించారు. తాము పార్టీ మారడం లేదని, మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం కావడంతో కావాలని పుకార్లు లేపుతున్నారని వ్యాఖ్యానించారు. మాకు ఎలాంటి ఫోన్ రాలేదు, వచ్చినా రెస్పాండ్ అవ్వమని, ప్రలోభాలకు లొంగేవాళ్లం కాదని తేల్చి చెప్పేశారు. పది రోజుల నుంచి మునుగోడులో మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తుల ఉమలు పని చేస్తున్నారని స్పష్టం చేశారు. అంతేకాక బీజేపీలోకి నలుగురు మాజీ ఎంపీలు, ఇద్దరు మంత్రులు, ఒక మంత్రి కొడుకు, ఒక మంత్రి అల్లుడు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.