కొండగట్టు అంజన్న…తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం. మూడు రోజుల క్రితం అంజన్న ఆలయంలో చోరీ జరిగింది. ఈ చోరీకి పాల్పడిన ముసుగు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం ముసుగు ధరించి స్వామివారి ఆలయంలో చోరబడ స్వామివారి వెండి, బంగారం ఎత్తుకెళ్లారు. ఈ చోరీకి సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. ఈ వీడియోల ఆధారంగా దొంగల గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ముసుగు దొంగలను అరెస్టు చేశారు.
కర్నాటకలో ని బీదర్ పట్టణంలో ఈ దొంగలు ఉన్నట్లు పక్కా సమాచారం తెలియడంతో తెలంగాణ పోలీసులు అక్కడికి వెళ్లారు. స్థానిక పోలీసుల సాయంతో దొంగలు తలదాచుకుంటున్న ప్రాంతానికి వెళ్లి వారిని అరెస్టు చేశారు. ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు జగిత్యాలకు తరలించారు. ఆలయంలో చోరీ చేసిన సొమ్ములో 60శాతం రికవరీ చేసినట్లు సమాచారం. మిగతా సొత్తును కూడా గుర్తించి స్వాధీనం చేసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే దొంగల అరెస్టకు సంబంధించి పోలీసులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.