కూకట్‌పల్లి గ్యాంగ్‌రేప్.. ముగ్గురూ మేజర్లే, ఓయో సిబ్బంది అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

కూకట్‌పల్లి గ్యాంగ్‌రేప్.. ముగ్గురూ మేజర్లే, ఓయో సిబ్బంది అరెస్ట్

October 16, 2020

కూకట్‌పల్లి డిగ్రీ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ ఘటనలో ముగ్గురూ మేజర్లే అని పోలీసులు తేల్చారు. మరోవైపు  అత్యాచారానికి పాల్పడిన ముగ్గురికీ ఓయో సిబ్బంది ప్రత్యేక గదిని కేటాయించినట్టు తెలిసింది. దీంతో ఓయూ సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు. బాధిత యువతి ఆసుపత్రిలో చేరాక ఈ కేసును జూబ్లీహిల్స్ పోలీసులు కూకట్‌పల్లికి బదిలీ చేశారు. ఈ ఘటనలో రాము, జోసెఫ్‌, న‌వీన్‌లపై కేసు నమోదు చేసుకున్న కూకట్‌పల్లి పోలీసులు వారిని  అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోపక్క బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అయితే, యువతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులంతా కనిపించకుండా పోయారు. వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో పోలీసులకు యువతి సికింద్రాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నట్టు తెలిసింది.

డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురికీ ఓయో సిబ్బంది ప్రత్యేక గదిని కేటాయించినట్టు విచారణలో తేలింది. గతంలో లైగింక దాడి, హింసా ఘటనలు జరిగినా ఓయో యాజమాన్యం తీరుమారడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓయో హోటల్‌ నిర్వాహకుల వల్లే అమాయక యువతులపై కామాంధులు రెచ్చిపోతున్నారని సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యువతకు విచ్చలవిడిగా అద్దెకు గదులు ఇస్తున్నారని.. యువతులను వెంట తీసుకెళుతున్నా హోటల్‌ నిర్వాహకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కూకట్‌పల్లిలోని ఓయో ఆనంద ఇన్‌ హోటల్‌ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, నిబంధనలు పట్టించుకోకుండా ఎవరికి పడితే వారికి రూమ్‌లు కేటాయిస్తున్నారని తెలిపారు. గదుల కేటాయింపులకు సంబంధించి మీడియా హోటల్‌కు చేరుకోగానే ఓ జంట అక్కడినుంచి పారిపోయిన దృశ్యాలు కెమెరాకి చిక్కాయి. కాగా, మీడియా కథనాలతో స్పందించిన పోలీసులు ఓయో హోటల్ నిర్వాహకులను, సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.