Koosukuntla Prabhakar Reddy as TRS candidate for Munugodu Constituency
mictv telugu

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

August 19, 2022

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అనివార్యమైన మునుగోడు ఉప ఎన్నిక వేడి అన్ని పార్టీలను తాకుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతుండడంతో నియోజకవర్గంలో త్రిముఖ పోటీ అనివార్యమవుతోంది. ఈ నేపథ్యంలో దూకుడు పెంచాలని అధికార టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్ధిని ప్రకటించి ప్రచారంలో దూసుకుపోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో మునుగోడు అభ్యర్ధిగా పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని నిలబెట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని శనివారం మునుగోడులో జరుగనున్న టీఆర్ఎస్ బహిరంగసభలో కేసీఆర్ స్వయంగా ప్రకటించనున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన 2014 మొదటి ఎన్నికల్లో కూసుకుంట్ల మునుగోడు నుంచి టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అయితే తర్వాత జరిగిన 2018 ముందస్తు ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అయితే టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతున్న కూసుకుంట్లపై అధిష్టానానికి వ్యతిరేకత లేకున్నా స్థానిక నాయకత్వం మాత్రం ఆయనను వ్యతిరేకిస్తోంది. ఆయనకు టికెట్ ఇస్తే పార్టీ కోసం పనిచేయలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకే టికెట్ ఇవ్వడంతో తర్వాతి పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయోనన్న ఆసక్తి నెలకొంది.