కొరటాల శివ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం  - MicTv.in - Telugu News
mictv telugu

కొరటాల శివ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం 

September 22, 2020

Koratala Shiva Assistant incident Attempt

టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ అసిస్టెంట్ మహేష్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. అనంతపురం జిల్లా మడకశిర పోలీస్ స్టేషన్ ఎదుట ఈ సంఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా మడకశిర మండలం చీపులేటి గ్రామానికి చెందిన మహేష్, దర్శకుడు  కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా పని చేస్తున్నాడు. సెప్టెంబర్ 8న పోలీసులు తన అన్నను అరెస్ట్ చేశారని.. తన అన్న కర్ణాటక మద్యం అక్రమంగా అమ్ముతున్నాడని పోలీసులు ఇంటికి వచ్చి విచక్షణారహితంగా ప్రవర్తించారని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగాడు. 

అక్కడే వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అయితే అప్రమత్తమైన పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ‘అక్రమంగా మద్యం అమ్ముతున్నారంటూ సోమవారం రాత్రి మా ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. అయితే ఇంట్లో మద్యం బాటిళ్లు దొరకలేదు. కానీ, మా ఇంటి పక్కన ఉన్న గల్లీలో 12 మద్యం సీసాలు దొరికాయి. దీంతో ఆ బాటిళ్లతో నాకు సంబంధం లేదని, మా ఇంట్లో దొరకలేదు కదా అని ప్రశ్నించాను. అందుకు పోలీసులు నా పట్ల దారుణంగా వ్యవహరించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అక్రమ మద్యం కేసు నమోదు చేశారు. దీంతో పెళ్లిపీటలపై దాకా వచ్చిన నా పెళ్లి ఆగిపోయింది. నా జీవితాన్ని పోలీసులు నాశనం చేశారు. అందుకే పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాను. ఈ విషయంలో నాకు న్యాయం చేయాలి’ అని మహేష్ ఆవేదన వ్యక్తంచేశాడు.