Krishna died in Osmania Hospital due to love affair
mictv telugu

ఒకే కులమైనా చంపేశారు.. జడ్చర్లలో ఘోరం

August 11, 2022

కులం, మతం వేరని ప్రేమికులను చంపేసిన ఘటనలు మనం ఇప్పటివరకు చూశాం. కానీ, యువతీయువకుడిది ఒకే కులమైనా సహించలేని యువతి సోదరులు చెల్లెలి ప్రియుడిని హత్య చేశారు. స్థానికంగా చర్చనీయాంశమైన ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో జరిగింది. స్థానిక సీఐ రమేశ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సింగిదాస్ కృష్ణ (24) అదే గ్రామంలో ఉండే తన కులానికే చెందిన యువతి (17)తో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం యువతి సోదరులు సింగిదాస్ మోహన్, సింగిదాస్ విజయ్‌లకు తెలిసింది.

ఈ క్రమంలో మంగళవారం గ్రామంలో మొహర్రం సందర్భంగా అందరూ పండుగలో నిమగ్నమవడంతో ప్రేమికులిద్దరూ గ్రామ శివారులో ఉన్న మొక్కజొన్న చేనులో కలుసుకోవాలని ప్లాన్ వేసుకున్నారు. అదను చూసి తప్పించుకొని పొలానికి వెళ్లగా, గమనించిన ఇద్దరు సోదరులు పొలం వద్దకు చేరుకొని ఆగ్రహంతో కృష్ణను కత్తితో పొట్టలో పొడిచారు. వీరు నరికిన దెబ్బకి కష్ణ కడుపులోని పేగులు, ఇతర అవయవాలు బయటికి వచ్చాయి. దీంతో ఎలాగైనా తనను కాపాడమని వేడుకోగా, నరికిన యువతి సోదరులే తర్వాత జాలిపడి అంబులెన్స్‌కి ఫోన్ చేసి చికిత్స కోసం ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించాడు. కాగా, ఇద్దరు నిందితులు పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయినట్టు సమాచారం. అటు ఆటో నడిపే తమ కొడుకు చనిపోవడంతో కృష్ణ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.