రుక్మిణి.. అడవిబిడ్డల ఆడబిడ్డ! - MicTv.in - Telugu News
mictv telugu

రుక్మిణి.. అడవిబిడ్డల ఆడబిడ్డ!

March 29, 2018

శ్రీకృష్ణుడి అష్టభార్యల్లో రుక్మిణి మొదటి సతి. ఇద్దరూ ప్రేమించుకోవడం, కృష్ణుడు ఆమెను లేవదీసుకుని రావడం, ఆమె సోదరుణ్ని శిక్షించడం.. తెలిసిన కథే. అయితే రుక్మిణి ఎవరు? విదర్భ రాజు భీష్మకుని కూతురు అని వ్యాస మహాభారతం చెబుతోంది. అయితే ఆమె అరుణాచల్ ప్రదేశ్‌లోని గిరిజనుల ఆడబిడ్డ అని కొందరు చెబుతున్నారు. మౌఖిక సంప్రదాయాలను, ఆచారాలను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.

అరుణాచల్ నుంచి గుజరాత్ వరకు..

గుజరాత్‌లోని మాధవ్‌పూర్‌లో ఇప్పుడు జాతర జరుగుతోంది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు విజయ్ రూపానీ, మహేశ్ శర్మలు మాట్లాడుతూ.. రుక్మిణి మూలాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇడు మిష్మి గిరిజన తెగలో ఉన్నాయన్నారు. నల్లనయ్య ఆమెను అక్కడి నుంచి ద్వారకకు తీసుకొచ్చాడని చెప్పారు.

వారేదే అఖండ భారత్ ప్రచారంలో భాగంగా చెప్పారని కొందరు అంటున్నారు. అయితే వారి ప్రకటనకు గట్టి ఆధారాలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. ఇడు మిషిమి తెగల్లో రుక్మిణీకృష్ణుల కథపై చాలా మౌఖిక సాహిత్యం ఉందని జానపదకథ విశ్లేషకుడు ప్రఫుల్లదత్త గోస్వామి చెబుతున్నారు. ‘ఈ తెగ మూలాలు రుక్మిణి సోదరుడైన రుక్మితో ముడిపడి ఉన్నాయి. రుక్మిణి, కృష్ణుడి ప్రేమకలాపాలపై ఈ గిరిజనులు పాటలు పాడుకుంటారు. రుక్మిణీ హరణ్ పేరుతో నాట్యాలు కూడా చేస్తారు. అరుణాచల్ ప్రదేశ్‌లో భీష్మక్‌నగర్ అనే నగరం ఉండేదని వీరు చెబుతారు. వీరిలో చూలికట(కేశఖండన) అనే సంప్రదాయం ఉంది. రుక్మికి కృష్ణుడు శిరోముండనం చేసినట్లు కథ ఉంది. ఇలా చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. అయితే రుక్మిణి గిరిజనపుత్రికే అని చెప్పడానికి మరిన్ని ఆధారాలు కావాలి’ అని గోస్వామి అంటున్నారు.