Krishna Vrinda Vihari Romance Drama naga shaurya movie review Naga Shaurya, Shirley Setia
mictv telugu

కృష్ణ వ్రింద విహారి.. మూవీ రివ్యూ

September 23, 2022

కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కథలకు ప్రేక్షకులు దాదాపు కనెక్టవుతారు. యంగ్ హీరోలతో పాటు కొందరు టాలీవుడ్ బడా హీరోలు కూడా ఈ బాక్సాఫీస్ ఫార్ములాతో బంపర్ హిట్లు కొట్టేందుకు ముందుంటారు. ఆ జానర్‌లోనే తెరకెక్కిన ‘కృష్ణ వ్రింద విహారి’ శుక్రవారం థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగశౌర్య, షిర్లే జంటగా నటించిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఓవరాల్‌గా ఓకేనా? సినిమా హిట్టేనా? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ విషయానికొస్తే పద్ధతికి ప్రతేడాది పట్టుపంచెలు కట్టించేంత సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పెరుగుతాడు కృష్ణ (నాగశౌర్య). అతని తల్లి అమృతవల్లి (రాధిక) అంటే ఇంట్లోవాళ్లతో పాటు ఊర్లోవాళ్లకి కూడా గౌరవం. తన మాటే శాసనంగా ఆవిడ మాటను అందరూ వింటూ భక్తిభయాలు ప్రదర్శిస్తుంటారు. సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం హైదరాబాద్ వచ్చిన కృష్ణ తన టీమ్ లీడరయిన వ్రింద(షిర్లే)‌ను ప్రేమిస్తాడు. కంప్లీట్ నార్త్ ట్రెండీ అమ్మాయి అయినా విజాతి ధ్రువాలు ఆకర్షించబడును అనే సూత్రం ప్రకారం కృష్ణను వ్రింద ప్రేమిస్తుంది. కానీ లోపల ప్రేమున్నా బయటికి మాత్రం నో అనే చెప్తూ తప్పించుకుని తిరుగుతుంటుంది. కారణమేంటో చెప్పమని గట్టిగా అడగడంతో తనకి పిల్లలు పుట్టరనీ, రేపు పెళ్లయ్యాక ఈ విషయంలో తను మాటలు పడడం ఇష్టం లేదనీ చెప్తుంది. పిల్లలు లేకపోయినా సరే, నీ ప్రేమే కావాలి, పెళ్లికి మా ఇంట్లో ఒప్పిస్తానని బయల్దేరతాడు కృష్ణ. అమ్మాయిలో లోపం అని చెప్తే కచ్చితంగా వద్దంటారని, తనలోనే లోపమని ఓ అబద్ధాన్ని క్రియేట్ చేస్తాడు కృష్ణ. దాంతో తప్పక, మరో దారిలేక వ్రిందతో పెళ్లికి ఒప్పుకుంటుంది అమృతవల్లి. కానీ తర్వాత అనూహ్యంగా వ్రింద గర్భం దాల్చడంతో అసలు కథ మొదలవుతుంది. అనుకున్నదొకటి అయిందొక్కటి కావడంతో క్యారెక్టర్ల మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి వెళ్లుంది.

కథ విన్నాక ఇటీవలి మూవీ “అంటే సుందరానికీ” గుర్తురావడమే కాదు, సినిమా చూస్తున్నప్పుడు కూడా ఆ నానీ మూవీలో కలిగిన భావన కలుగుతుంది. పైగా హీర బ్రాహ్మణ కుటుంబ నేపథ్యంతో ‘అదుర్స్’, ’డీజే’ ఇలా చాలానే సినిమాలొచ్చాయి. ఈ సినిమాలో కూడా అక్కడక్కడా ఆ ఛాయలు కనిపిస్తాయి. వెన్నెల కిషోర్, సత్య, రాహుల్ రామక్రిష్ణ, బ్రహ్మజీ కామెడీని పండించి పాత్రలకు తగ్గ న్యాయం చేశారు. పెళ్లయిన మగాడి ఫ్రస్ట్రేషన్, అత్తాకోడళ్ల నడుమ నలిగే కొడుకులా కొన్ని సన్నివేశాలు బాగా పడ్డాయి. క్లైమాక్స్‌లో మరీ అవసరం లేకపోయినా దూర్చిన ఓ ఫైట్, సినిమా చివర్లో తెలుగు సినిమా అని పనిగట్టుకుని గుర్తుచేసేలా పెట్టిన ఎయిర్ పోర్టు రొడ్డకొట్టుడు దృశ్యాలు పెద్దగా కదిలించవు. మధ్య మధ్యలో వచ్చే పాటలు, ప్రేమ సన్నివేశాలు, ఆఫీసు సన్నివేశాలు కా..స్త విసుగెత్తించినా మొత్తంగా పర్లేదు, ఓసారి చూసేయొచ్చు.

నాగశౌర్యకి తన గత చిత్రాలు, వాటి ఫలితాల నుంచి కాస్త ఊరటననిచ్చే సినిమానే ఇది. డైరెక్టర్ గా అనీష్ కృష్ణ బాగానే పనితనం చూయించాడు. తను డైరెక్ట్ చేసిన అలా ఎలా?, లవర్, గాలిసంపత్ లాంటి సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కాస్త కసిగానే ఈ ప్రాజెక్ట్‌పై పనిచేశాడు. ఇక బాక్సాఫీస్ పరంగా చూసుకుంటే కొద్దివారాలుగా వస్తున్న ఫ్లాప్ కమర్షియల్ చిత్రాలతో పోలిస్తే కొంత బెటరే. సకుటుంబ పరివారానికి, యువతకు నచ్చే హాస్యం వగైరా ఉన్నాయి కాబట్టి హిట్టనే చెప్పుకోవచ్చు.
అంటే సుందరానికీ రిలీజయ్యాక మూవీ కథ సేమ్ ఉందని తెలియడంతో సినిమా కావాలనే కాస్త ఆలస్యంగా విడుదల చేశారో? ఆ మూవీ పెద్దగా ఎవరూ చూడకుండా ఫ్లాప్ అయింది కాబట్టి కథను మార్చే ప్రయత్నాలేమీ చేయలేదేమో గానీ.. స్క్రీన్ ప్లే కాస్త ఫ్లాట్ గా అనిపించినా ఫ్యామిలీ ఆడియెన్స్ ఫ్లాట్ కాబట్టి సినిమా సేఫే.