సినీ నటుడు కృష్ణం రాజు భూ వివాదంపై కోర్టుకెక్కారు.గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ కోసం సేకరించిన భూమికి పరిహారం ఇవ్వకుండానే స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు న్యాయం చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి కౌంటర్ దాఖలు చేయాలని ఏయిర్ పోర్ట్ అథారిటీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
కృష్ణా జిల్లా కేసరపల్లిలో గన్నవరం ఏయిర్ పోర్టు అథారిటీ గతంలో 760 ఎకరాల భూములను సేకరించింది. అమరావతిలో రాజధాని ఏర్పడిన తర్వాత సీఆర్డీఏ కింద పరిహారం ఇస్తామని పేర్కొన్నారు. అక్కడ నిర్మాణాలు, పండ్ల తోటలు ఉండటంతో పరిహారం ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అందులో నటుడు కృష్ణంరాజు దంపతులకు 31 ఎకరాల భూమి కూడా ఉంది. దీనికి ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే భూములను తీసుకున్నారని వెంటే వాటిని చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
కాగా ఇక్కడే మరో నిర్మాత చలసాని అశ్వనీదత్ కూడా తన 39 ఎకరాల భూమికి రూ.210 కోట్లను చెల్లించడం లేదని పిటిషన్ వేశారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చిన తర్వాత అక్కడ భూముల ధరలు పడిపోయాయి. దీనికి తోడు పరిహారం కూడా అందకపోవడంతో కొంతమంది రైతులు విమానాశ్రయ స్వాధీనంలోని భూముల్లో ఇప్పటికే సాగు కూడా చేస్తున్నారు.