Krishnamraj's last rites were done by his own hands
mictv telugu

అతడి చేతుల మీదుగానే కృష్ణంరాజు అంత్యక్రియలు

September 12, 2022

తెలుగు చిత్రసీమ పరిశ్రమలో సీనియర్ రెబల్ స్టార్‌గా పేరుగాంచిన ప్రముఖ నటుడు కృష్ణం రాజు మృతి చెందడంతో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న టాలీవుడ్ పెద్దలు, యువ హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్ సైతం ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేస్తూ, ప్రభుత్వం అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలను నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు.

ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు జరగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు మొయినాబాద్ సమీపంలోని కనకమామిడిలో ఉన్న ఫామ్ హౌస్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. సినీ నటుడు ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ప్రస్తుతం కృష్ణంరాజు భౌతికకాయం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద ఉంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను కడసారి చూసుకుని, నివాళి అర్పిస్తున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో కొంత కాలంగా బాధ పడుతున్న కృష్ణంరాజు నిన్న తెల్లవారుజామున 3.25 గంటలకు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

నటుడు కృష్ణంరాజు.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు స్వగ్రామం. కృష్ణంరాజుకు, శ్యామలా దేవితో 1996లో నవంబరు 21న వివాహం జరిగింది. వీరికి ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు. ఆయన 1966వ సంవత్సరంలో చిలకా గోరింక సినిమాతో తెలుగు సినీ ప్రియులకు హీరోగా పరిచమై సూమారు 200 సినిమాల్లో నటించారు. 2012లో ప్రభాస్ హీరోగా రాఘవ లారెన్స్ తెరకెక్కించిన రెబల్ సినిమాలో తండ్రి పాత్ర పోషించి ప్రేక్షకుల మదిని దోచుకున్నారు.