నాని మ్యాజిక్ మిస్స‌యింది - MicTv.in - Telugu News
mictv telugu

నాని మ్యాజిక్ మిస్స‌యింది

April 12, 2018

తెలుగులో ప్ర‌స్తుతం నాని హ‌వా న‌డుస్తోంది. వ‌రుస‌గా ఎనిమిది స‌క్సెస్‌లు రావ‌డం, నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే  న‌మ్మ‌కం ఉండ‌టంతో అత‌డితో సినిమాలు చేయ‌డానికి అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సైతం ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. మూడో హ్యాట్రిక్ కోసం  నాని వినోదాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీని న‌మ్ముకున్నారు. సింపుల్ క‌థ‌ల‌కు కామెడీని మేళ‌వించి వెంక‌ట్రాద్రి ఎక్స్‌ప్రెస్,  ఎక్స్‌ప్రెస్‌ రాజాల‌తో మంచి విజ‌యాల్ని అందుకున్న గాంధీ ఈసారి త‌న పంథాకు భిన్నంగా క్రైమ్‌, మాస్, ద్విపాత్రాభిన‌యం అనే అంశాల‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు.

ఒకే పోలిక‌లు క‌లిగి ఉన్న ఎలాంటి సంబంధ‌ బాంధ‌వ్యాలు లేని భిన్న  నేప‌థ్యాలు, ప్రాంతాల‌కు చెందిన ఇద్ద‌రు యువ‌కుల క‌థ ఇది. కృష్ణ‌ది చిత్తూరు జిల్లాలోని అక్కుర్తి అనే ప‌ల్లెటూరు. పంట‌పొలాల‌కు కాప‌లా కాసే ప‌ని చేస్తుంటాడు. క‌నిపించిన ప్ర‌తి అమ్మాయికి త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తాడు. కానీ స్నేహితుల‌తో క‌లిసి జులాయిగా తిరుగుతుండే అత‌డి ప్రేమ‌ను ఎవ‌రూ అంగీక‌రించరు. ఎప్ప‌టికైనా త‌న‌ను ఇష్ట‌ప‌డే అమ్మాయి వ‌స్తుంద‌ని న‌మ్మ‌కంతో ఎదురుచూస్తుంటాడు. హైద‌రాబాద్ నుంచి రియా(రుక్స‌ర్‌మీర్‌) అనే డాక్ట‌ర్  కృష్ణ ఉండే ఊరికి వ‌స్తుంది. తొలిచూపుల‌తోనే ఆ అమ్మాయిని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు కృష్ణ‌. అత‌డిలోని మంచిత‌నం చూసి రియా కూడా కృష్ణ‌ను ప్రేమిస్తుంది. మ‌రోవైపు అర్జున్‌(నాని) జ‌ర్మ‌నీలోని ప్రాగ్ నగ‌రంలోనే పెద్ద రాక్‌స్టార్‌, స్త్రీలోలుడు. ప్రేమ‌, పెళ్లి లాంటివి త‌న‌కు న‌చ్చ‌వు. త‌న ఆనందం, స్వార్థం కోస‌మే అమ్మాయిల‌తో స్నేహం చేస్తుంటాడు. సుబ్బ‌ల‌క్ష్మి ప‌రిచ‌యం అత‌డి ఆలోచ‌నా ధోర‌ణిని మారుస్తుంది.మ‌న‌స్ఫూర్తిగా ఆమెను ఇష్ట‌ప‌డ‌తాడు. కానీ అంద‌రిలాగే త‌న‌ను మోసం చేస్తున్నాడ‌నే ఆలోచ‌న‌తో సుబ్బ‌ల‌క్ష్మి…అర్జున్‌ను అస‌హ్యించుకుంటుంది.. అత‌డికి దూరంగా ఉండాల‌నే ఆలోచ‌న‌తో  హైద‌రాబాద్‌కు వెళ్లిపోతుంది. అదే స‌మ‌యంలో కృష్ణ‌, రియాల ప్రేమ‌ వ్య‌వ‌హారం ఇంట్లో వాళ్ల‌కు తెలియ‌డంతో ఆమెను హైద‌రాబాద్ పంపిచేస్తారు. భిన్న ప్ర‌దేశాల నుంచి హైద‌రాబాద్ చేరుకున్న రియా, సుబ్బ‌ల‌క్ష్మి క‌నిపించ‌కుండా పోతారు. వారిని వెతుక్కుంటూ వ‌చ్చిన కృష్ణ‌, అర్జున్‌ల‌కు ప్రియురాళ్లు కిడ్నాప్ అయ్యార‌నే నిజం తెలుస్తుంది. రియా, సుబ్బ‌ల‌క్ష్మిల‌ను ఎవ‌రు కిడ్నాప్ చేశారు. తమ ప్రాణాల‌కు తెగించి వారిని అర్జున్‌, కృష్ణ క‌లిసి ఎలా కాపాడుకున్నార‌న్న‌దే ఈ చిత్ర క‌థ‌.

ఒకేలా ఉండే ఇద్ద‌రు వ్య‌క్తులు, వారిద్ద‌రు క‌లిసి చేసే గందరగోళం తెలుగు చిత్ర‌సీమ‌కు కొత్తేమీ కాదు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి అగ్ర హీరోలంద‌రూ ఈ ఫార్ములాతో హిట్ కొట్టారు. ఈ పాయింట్‌కు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే ముఠా క్రైమ్ ఎలిమెంట్‌ను మేళ‌వించి ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ సినిమాను తెర‌కెక్కించారు.  ప్ర‌థ‌మార్థంలో కృష్ణ, అర్జున్‌ల ప‌రిచ‌య ఘ‌ట్టాలు, వారి ప్రేమ‌వ్య‌వ‌హారాల‌తో న‌డిపించారు ద‌ర్శ‌కుడు. చిత్తూరులోని ప‌ల్లెటూరి, జ‌ర్మ‌నీ న‌గ‌రాన్ని ఒకదానికొక‌టి సంబంధంలేని ప్ర‌దేశాల్ని స‌మారంతంగా చూపిస్తూ న‌డిపించిన ఆ స‌న్నివేశాల‌న్నీ ఆక‌ట్టుకుంటాయి. విరామ స‌న్నివేశాల‌కు ముందు అస‌లు క‌థ‌లోకి వెళ్లిన ద‌ర్శ‌కుడు ద్వితీయార్థం మొత్తం కిడ్నాపింగ్ ముఠాను హీరోలు ఇద్ద‌రు క‌లిసి ప‌ట్టుకునే స‌న్నివేశాల‌తో అల్లుకున్నారు.

ప్ర‌థ‌మార్థంలో వినోదం బాగానే వ‌ర్క‌వుట్ అయింది. ప‌ల్లెటూరిలో హీరో, అత‌డు స్నేహితులు క‌లిసి చేసే ప‌నుల‌న్నీ న‌వ్విస్తాయి. త‌న‌కు ప‌రిచ‌య‌మున్న నేటివిటీ కావ‌డంతో ఆ నేప‌థ్యాన్ని బాగా రాసుకున్నాడు. అయితే దానికి స‌మాంత‌రంగా ప‌ట్ట‌ణ నేప‌థ్య ప్రేమ‌క‌థ స‌రిగా వ‌ర్క‌వుట్ కాలేదు. అలాగే హ్యూమ‌న్ ట్రాఫికింగ్ ముఠా నుంచి హీరోయిన్ల‌ను కాపాడే స‌న్నివేశాల్ని ఆస‌క్తిక‌రంగా న‌డిపించ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యారు. త‌మ‌కు పూర్తిగా తెలియ‌ని కొత్త ప్ర‌దేశంలో హీరోలు ఇద్ద‌రు క‌లిసి ప్ర‌తినాయ‌కుల్ని అన్వేషించే ఘ‌ట్టాల‌న్నీ ఊహాజ‌నీతంగా సాగుతాయి.  క్రైమ్ క‌థ‌ల్లో ఉండాల్సిన ఉత్కంఠ ఇందులో లోపించింది. ఒక్కోచిక్కుముడిని విప్పుకుంటూ వెళితూ కిడ్నాప‌ర్స్‌ను ప‌ట్టుకునేలా సినిమాలు మ‌లుచుకుంటే బాగుండేది. ద‌ర్శ‌కుడు మాత్రం రొటీన్ వైపు అడుగులు వేశారు. ఒకే పోలిక‌తో ఉండే వ్య‌క్తుల వ‌ల్ల ఎదుర‌య్యే గంద‌ర‌గోళంలో కామెడీ స‌రిగా వ‌ర్క‌వుట్ కాలేదు.

తొలి రెండు సినిమాల్లో ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లో కామెడీని చ‌క్క‌గా మిళితం చేసి విజ‌యాల్ని అందుకున్న ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో మాత్రం ఆ ప్ర‌య‌త్నంలో త‌డ‌బ‌డ్డారు. సెకాండాఫ్‌ను వినోదానికి దూరంగా పూర్తిగా సీరియ‌స్‌గా  అల్లుకున్నారు. కథ చాలా చిన్న‌ది కావ‌డం దానికి నిల‌బెట్టే స‌న్నివేశాలు బ‌లం లేక‌పోవ‌డంలో సినిమా సుదీర్ఘంగా సాగిన అనుభూతి క‌లుగుతుంది.. క‌థ‌కు సంబంధంలేని అంశాల‌తో కాల‌క్షేపం చేస్తూ ఏదోలా బండి లాగించారనే ఆలోచ‌న‌ను క‌లిగిస్తుంది..

ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడు ఎంచుకున్న‌ హ్యూమ‌న్ ట్రాఫికింగ్ అనే పాయింట్ పాత‌దే. గులాబీ, ద‌డ‌, హార్ట్ ఎటాక్‌తో పాటు ఈ త‌ర‌హా క‌థాంశాల‌తో తెలుగులో చాలా సినిమాలు రూపొందాయి. ఈ రొటీన్  క‌థ‌కు ద్విపాత్రాభిన‌యం అనే పాయింట్‌ను కొత్త‌గా జోడించి సినిమాను తెర‌కెక్కించారు. రాక్‌స్టార్ ఎపిసోడ్ సైతం వెంక‌టేష్ న‌టించిన ప్రేమ‌తో రా సినిమాను త‌ల‌పిస్తుంది

విరుద్ధ భావాలు క‌లిగిన రెండు పాత్ర‌ల్లో నాని చ‌క్క‌టి వైవిధ్యాన్ని క‌న‌బ‌రిచారు. సాదాసీదా క‌థ‌ను త‌న మేన‌రిజ‌మ్స్‌, స‌హ‌జ న‌ట‌న‌తో నిల‌బెట్టారు. ముఖ్యంగా కృష్ణ అనే ప‌ల్లెటూరి యువ‌కుడిగా  స‌రికొత్త‌గా క‌నిపించారు. చిత్తూరు యాస‌లో అత‌డు చెప్పే సంభాష‌ణ‌లు, పొగ‌రుతో కూడిన మ‌న‌స్త‌త్వాన్ని మాస్‌ పంథాలో ఆవిష్క‌రించిన తీరు బాగుంది. త‌న స‌హ‌జ శైలిని మార్చుకొని అత‌డు చేసిన సినిమా ఇది. ప్రియురాలు దూర‌మై ప్రేమికుడు ప‌డే ఆవేద‌న‌ను ఆ పాత్ర ద్వారా చూపించిన తీరు హృద్యంగా సాగుతుంది. రాక్‌స్టార్ అర్జున్‌గా  స్టైలిష్‌గా క‌నిపించారు. క‌థానాయిక‌ల్లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కంటే రుక్స‌ర్‌మీర్‌కే ఎక్కువ మార్కులు ప‌డ్డాయి. తొలి సినిమా అయినా చ‌క్క‌టి హావ‌భావాల‌తో ఆక‌ట్టుకుంటుంది. క‌థ మొత్తం నాని రెండు పాత్ర‌ల చుట్టే తిర‌గ‌డంతో క‌థానాయిక‌ల పాత్ర‌ల‌కు సెకండ్‌హాప్‌లో ప్రాధాన్య‌త త‌గ్గింది. ల‌ఘు చిత్రాల్లో క‌నిపించే సుద‌ర్శ‌న్‌, హ‌రీష్ చిత్తూరు యాస‌లో చ‌క్క‌టి న‌వ్వుల‌ను పండించారు. బ్ర‌హ్మాజీ కామెడీ వ‌ర్క‌వుట్ అయింది. బ‌ల‌మైన ప్ర‌తినాయ‌కుడు అంటూ ఈ సినిమాలో ఎవ‌రూ లేరు. అది కూడా మైన‌స్‌గా మారింది.

ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌ల్ని న‌మ్మి క‌థ‌లో బ‌లం లేక‌పోయినా భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు నిర్మాత‌లు. హిప్‌హాప్ త‌మిళ బాణీల్లో దారి చూడు దుమ్ము చూడా మాస్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. జాన‌ప‌ద‌శైలిలో పెంచ‌ల్‌దాస్ ఈ గీతాన్ని చ‌క్క‌గా ఆల‌పించారు. గ‌తంలో నాని న‌టించిన‌ సినిమాల్లో క‌థ‌ల ప‌రంగా కొత్త‌ద‌నం లేక‌పోయినా రెండు గంట‌ల పాటు వినోదాన్ని పంచి విజ‌యాల్ని అందుకున్నారు. ఆ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో లోపించింది. క‌థ‌ల ఎంపిక‌లో నాని జ‌డ్జిమెంట్ ఈ సారి మిస్ అయింది. న‌టుడిగా కొత్త దారిలో ప‌య‌నించాల‌నే అత‌డి ఆలోచ‌న విధానం బాగానే ఉన్నా అందుకు త‌గ్గ క‌థ‌ను ఎంచుకోవ‌డంలో త‌ప్ప‌ట‌డుగు వేశారు. దాంతో కృష్టార్జున యుద్ధం స‌గ‌టు సినిమాగా మిగిలిపోయింది. నాని అభిన‌యం, గ‌త స‌క్సెస్‌లు, వేస‌వి సెల‌వుల దృష్ట్యా ప్రారంభ‌వ‌సూళ్లు బాగానే ఉన్నా అవి ఈసినిమాను ఏ మేర‌కు  గ‌ట్టెక్కిస్తాయో వేచిచూడాలి.

రేటింగ్‌-2.25/5