Krishna’s mortal remains to be kept at Gachibowli stadium
mictv telugu

కృష్ణ కడచూపు కోసం అభిమానులు అక్కడికి వెళ్లాలి

November 15, 2022

దిగ్గజ నటుడు కృష్ణ మరణం పట్ల ఆయన అభిమానులే కాక, తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విలక్షణ నటనతో ఎందరో హృదయాలను గెలుచుకున్న ఆయన.. ఇక తిరిగిరారని తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు. మరో వైపు ఆయన మరణవార్త తెలిసి.. అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రజలు కడసారి ఆయన్ను చూసేందుకు హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. ఇప్పటికే కృష్ణ పార్థివదేహాన్ని కాంటినెంటల్‌ ఆస్పత్రి నుంచి నానక్‌రాంగూడలోని ఆయన ఇంటికి తరలించారు. అక్కడ ఆయన భౌతికకాయాన్ని కాసేపు ఉంచి అక్కడి నుంచి అభిమానుల సందర్శనార్థం గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. ఈ మేరకు కృష్ణ కుటుంబ సభ్యులు, పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అభిమానుల సందర్శనార్ధం ఇవాళ రాత్రి గచ్చిబౌలి స్టేడియంలోనే ఆయన పార్థివదేహాన్ని ఉంచనున్నారు. రేపు ఉదయం స్టేడియం నుంచి పద్మాలయ స్టూడియోస్‌కు తరలిస్తారు. అక్కడ కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తయ్యాక మధ్యాహ్నానికి మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు వెల్లడించారు.

కృష్ణ మృతి పట్ల ఘట్టమనేని కుటుంబం స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘మా కుటుంబానికి కృష్ణ మృతి తీరనిలోటు. కేవలం వెండితెరపైనే కాదు, ప్రేమ, మానవత్వం, ఆప్యాయత పంచడంలోనూ సూపర్‌స్టారే. ఆయన చేసిన ఎన్నో మంచి పనులు ద్వారా మన మధ్య జీవించే ఉంటారు. అంతేకాదు, ఎంతోమంది కృష్ణ స్ఫూర్తిప్రదాత. అన్నింటికన్నా మిన్నగా మమ్మల్ని కృష్ణ ప్రేమించారు. ఇక ప్రతి రోజూ ఆయన్ని కోల్పోయిన భారంతోనే గడుపుతాం’’ అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.