హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించొద్దు.. కేటీఆర్ ఆదేశం  - MicTv.in - Telugu News
mictv telugu

హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించొద్దు.. కేటీఆర్ ఆదేశం 

March 25, 2020

Krt orders not vacate students from hostels .

కరోనా లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లోని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, చిన్నాచితకా ఉద్యోగులు నానా అవస్థలూ పడుతున్నారు. హాస్టళ్ల నుంచి యజమానులు వెళ్లగొడుతుండడం, ఇళ్లకు వెళ్లడానికి బస్సులు, రైళ్లు లేకపోవడంతో ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక అల్లాడిపోతున్నారు. సొంతూళ్లకు వెళ్లడానికి పోలీసులు పాసులు ఇస్తున్నా, ఒక్కసారిగా వేల సంఖ్యలో విద్యార్థులు రావడంతో పరిస్థితి అదుపుతప్పింది. గుంపులు గుంపులుగా విద్యార్థులు వస్తుండడంతో పోలీసులు కరోనా భయంతో తలలు పట్టుకుంటున్నారు. 

దీనిపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. హాస్టళ్ల నుంచి ఎవరినీ ఖాళీ చేయించకూడదని ఆదేశించారు. ‘అవాంఛనీయ ఆందోళన సృష్టించకండి. హాస్టళ్లను నడపడానికి కావలసిన సదుపాయాలు కల్పించాలని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసులకు చెప్పాను’ అని ఆయన ట్వీట్ చేశారు. కేటీఆర్ ఈ రోజు గోల్నాకలోని నైట్ షెల్టర్‌ను సందర్శించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు.