స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఇవాళ్టి నుంచి ప్రపంచ ఆర్థిక సదస్సు-2023 జరగనుంది. జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు జ్యూరిచ్ విమానాశ్రయంలో ఎన్నారైలు భారీ ఎత్తున వచ్చి ఘన స్వాగతం పలికారు. జ్యూరిచ్ నగరంలోనే కాక, స్విట్జర్లాండ్‌లోని ఇతర నగరాలు, యూరోప్‌లోని ఇతర దేశాల నుండి వచ్చిన ఎన్నారైలు విమానాశ్రయంలో మంత్రికి స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు శ్రీధర్ గండె, ఇతర తెలుగు సంఘాల ప్రతినిధులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం జ్యూరిక్ నగరంలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన “మీట్ ఎండ్ గ్రీట్” కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. సోమవారం డావోస్ చేరుకొని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొంటారు.
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు కేటీఆర్ హాజరుకావడం ఇది అయిదోసారి. గతంలో 2018, 2019, 2020, 2022 సంవత్సరాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొన్నారు. ప్రతీ ఏటా జనవరిలో వరల్డ్ ఎకనామిక్ సమావేశాలు జరగనుండగా కోవిడ్ పరిస్థితుల్లో గత ఏడాది మేలో జరిగాయి. ‘కో ఆపరేషన్ ఇన్ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్’ నినాదంతో జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సు ఆల్పైన్ పర్వత సానువుల్లో సముద్రమట్టానికి 1,500 మీటర్ల ఎత్తున ఉన్న విడిది పట్టణం దావోస్ ఆతిథ్యమిస్తోంది. ఈసారి ‘భిన్న ప్రపంచంలో సహకారం’ అనే నినాదంతో సదస్సు జరుగుతోంది. ఇందులో మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేస్తారు.
ఈ సదస్సుకు దాదాపు 52 దేశాల అధినేతలు హాజరవుతున్నారు. 130 దేశాలకు చెందిన 2,700 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొని.. ఆర్థిక, ఇంధన, ఆహార సంక్షోభాల పరిష్కారంపై చర్చిస్తారు. భారత్ నుంచి కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, అశ్వినీ వైష్ణవ్, స్మృతి ఇరానీ, ఆర్కే సింగ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే, పలువురు సీఎంలు, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. ‘తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి’ అనేదే తమ నినాదమని మంత్రి కేటీఆర్ ట్విటర్లో తెలిపారు.