‘మీతో మేము-మాతో మీరు’ఎన్నారైలతో కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

‘మీతో మేము-మాతో మీరు’ఎన్నారైలతో కేటీఆర్

May 22, 2017

 

ఆత్మీయ పలకరింపులు…అభివృద్ధి సందేశాలు…ముఖాముఖిలో ముచ్చటైన ప్రశ్నలు…ఉరకలేసే ఉత్సాహం…ఏ దేశమేగినా మాతృభూమి రుణం తీర్చుకోవాలనే పిలుపులతో తెలంగాణ మంత్రి కేటీర్ అమెరికా టూర్ కొనసాగుతోంది.మీతో మేము-మాతో మీరు అంటూ ఎన్నారైలతో కలిసిపోతున్నారు. చేసిన పనుల్ని వివరిస్తూ..చేయాల్సిన లక్ష్యాలను తెలియజేస్తూ ఎన్నారైలతో కేటీఆర్ మమేకమవుతున్నారు.
తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఐటీశాఖమంత్రి కేటీఆర్ ఎన్నారైలకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో పాఠశాలలు, పీహెచ్‌సీలు, గ్రంథాలయాల అభివృద్ధికి యత్నించాలని సూచించారు. విద్యుత్తు, సాగునీటి రంగాల్లో దీర్ఘకాలిక ప్రాజెక్టులు చేపట్టామని, ఇవన్నీ పూర్తయితే బంగారు తెలంగాణ ఖచ్చితంగా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
తొలిరోజు టూర్ లో కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో తెలంగాణ ఎన్నారైలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలను ఎన్నారైలకు వివరించారు. ఆతర్వాత ముఖాముఖిలో పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రాష్ట్ర సాధనకు సహకరించినట్లే ఎన్‌ఆర్‌ఐలు అభివృద్ధిలోనూ భాగస్వామ్యం కావాలని కోరారు. రాష్ర్టంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలతో ఏం చేయాలో పాలుపోని ప్రతిపక్షాలు అడ్డగోలుగా విమర్షలు చేస్తున్నాయని, అలాంటి విమర్శలకు ప్రజలే సమాధానం చేప్తున్నారని కేటీఆర్ అన్నారు. అరవై ఏళ్లలో పాలకులు చేయలేని పనుల్ని… కేసీఆర్ సర్కార్ కేవలం మూడేళ్లలో సాధించిందని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలను అడిగి తెసుకోవాలన్నారు.
నూతన గురుకులాలు, వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రోత్సాకాలు, పరిశ్రమలకు, పెట్టుబడులకు ఊతమిచ్చేలా చేపట్టిన కార్యక్రమాలను మంత్రి తెలియజేశారు.
తెలంగాణ అభివృద్దితో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో కలిసి రావాలని, ఇందుకోసం తాము పుట్టిన గ్రామాల అవసరాల మేరకు కొంతైనా సాయం చేయాలని కోరారు. ముఖ్యంగా కేంద్రం ప్రవేశ పెట్టిన ఇండియా డెవలప్ ఫండ్ ద్వారా ప్రవాసులు ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా అభివృద్ది కార్యక్రమాలకే పోతుందన్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పలువురు ఏన్నారైలు గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమాలను కేటీఆర్ ఉదహరించారు. హైదరాబాద్ కేంద్రంగా ఐటి పరిశ్రమ సాధిస్తున్న ప్రగతిని విరించిన కేటీఆర్ , ఐటి రంగంలోని డాటా అనలిటిక్స్, డాటా సెక్యూరీటి వంటి నూతన రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చేస్తున్నప్రయత్నాలను తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ చొరవతో పలువురు ఏన్నారైలు కలసి ఖమ్మంతో ఐటి పరిశ్రమ ఎర్పాటుకు ముందుకు వచ్చారని, ఇలాంటి ప్రయత్నానికి మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఐటి టవర్ నిర్మాణ చేపట్టబోతున్నామని చెప్పారు. ఇలా ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటి విస్తరణకు ప్రవాస భారతీయులు చొరవ చూపాలని కేటీఆర్ కోరారు.