సెంట్రల్ లైబ్రరీ అభివృద్ధికి 5 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

సెంట్రల్ లైబ్రరీ అభివృద్ధికి 5 కోట్లు

November 21, 2017

చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయ అభివృద్ధి కోసం  రూ . 5  కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పలు  పోటీ పరీక్షలకు హాజరవుతున్న నిరుద్యోగులతో మంగళవారం ఆయన మాట్లాడారు. సెంట్రల్ లైబ్రరీలో ఆధునిక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రంలో  సంవత్సరం లోపు లక్ష 12 వేల ఉద్యోగాల భర్తీని తప్పని సరిగా చేపడతామని స్పష్టం చేశారు. నారాయణగూడలో మునిసిపల్ సర్కిల్ కార్యాలయాన్ని నిర్మిస్తామని,  చిక్కడపల్లి మార్కెట్ లో జీ+5 పద్ధతిలో మార్కెట్ కడతామని ప్రకటించారు.

కేటీఆర్.. మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ నగర్ మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఎమ్మెలేలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి మాగంటి గోపినాథ్‌లతో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

బన్సీలాల్ పేట్‌లో ఉన్నత ప్రమాణాలతో నిర్మించిన ఆధునిక కమ్యూనిటీ హాలును పరిశీలించారు. గ్రేటర్ పరిధిలో ప్రతి నియోజకవర్గములో కనీసం రెండు మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లను నిర్మిస్తామన్నారు. రూ. 30 .32  కోట్ల వ్యయంతో 16 ఫంక్షన్ హాల్ ల నిర్మాణాలను చేపట్టామని తెలిపారు.