టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ అవుతారని టీఆర్ఎస్ నాయకులు గొంతెత్తి చాటుతున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు కేటీఆర్ సీఎం అంటూ ప్రకటించడం, ఫ్లెక్సీలు కొట్టించడం తెలిసిందే. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నెక్స్ట్ సీఎం కేటీఆర్ అంటూ తెగేసి చెప్పేశాడు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ సమర్థవంతమైన నాయకుడని..ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు పుష్కలంగా ఉన్నాయంటూ కొనియాడారు. మంత్రి కేటీఆర్ కారణంగానే.. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున వివిధ పరిశ్రమలు తరలి వస్తున్నాయని, అలాగే వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యలు తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి.
ఈ నెల 8న కేటీఆర్ వరంగల్ జిల్లా ఏనుగల్లు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, జనగామ జిల్లా పాలకుర్తి, దేవరుప్పులలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా సభల ఏర్పాట్లను ఎర్రబెల్లి సోమవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో సభను నిర్వహిస్తున్నట్లు ఎర్ర బెల్లి తెలిపారు. ఈ సభకు కేటీఆర్ ముఖ్య అథితిగా హాజరవుతున్నట్లు ప్రకటించారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు