అందుకే కేటీఆర్ అన్నంటే ఇష్టం.. విజయ్ దేవరకొండ
ఇలాంటి నాయకులు అంటే నాకు చాలా ఇష్టం అంటూ అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘సేవ్ నల్లమల’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై యువ నటుడు విజయ్ స్పందించాడు. కేటీఆర్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘మీ నిర్ణయం నా ముఖంపై చిరునవ్వు తెప్పించింది. మనం అడిగాం, ప్రభుత్వం మన వెంటే ఉండి మద్దతుగా నిలిచింది. పవర్.. బాధ్యత.. యాక్షన్.. ఇలాంటి నాయకులంటే నాకు చాలా ఇష్టం. మీకు నా పూర్తి ప్రేమ, గౌరవం ఎల్లప్పుడూ ఉంటాయి కేటీఆర్ అన్నా’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నాడు.
మరోవైపు విజయ్ తన ఎఫ్‌బీ ఖాతాలోనూ ఓ పోస్ట్ పెట్టాడు. ‘నల్లమల అడవుల విషయంలో మనమంతా కలిసి ఏం సాధించామో చూడండి. ఓ మంచి పని కోసం అందరూ ఐకమత్యంగా కృషి చేస్తే ఎన్నో మార్పులు తీసుకురావొచ్చు’ అని విజయ్ పేర్కొన్నాడు. దీనిపై నెటిజన్లు చాలామంది స్పందిస్తున్నారు. మంచిని కాపాడ్డానికి చేసే ప్రయత్నంలో ఎన్నో విమర్శలు వస్తాయి.. వాటిని పట్టించుకోకపోవడం మంచిది అంటూ కామెంట్లు చేస్తున్నారు. నల్లమల విషయంలో కేంద్రం వెనకడుగు వేయాలని.. అప్పుడే తెలుగు రాష్ట్రాలకు ఏమైనా మంచి చేసిందుంటే అదే అవుతుంది అని మరికొందరు కోరుతున్నారు.