పేద, అనాథ విద్యాకుసుమాలకు కేటీఆర్ అండ.. - MicTv.in - Telugu News
mictv telugu

పేద, అనాథ విద్యాకుసుమాలకు కేటీఆర్ అండ..

July 18, 2019

KTR financial

పేదరికంలో మగ్గుతున్న ఇద్దరు చదువులతల్లలకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. పేదరికాన్ని జయించి చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ ఇద్దరు విద్యార్ధినులకు (మేకల అంజలి, రుద్ర రచన) కేటీఆర్ ఈరోజు ఆర్థిక సాయం అందించారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారిలో ఒకరు అనాథ కాగా, మరొకరు కడు పేదరికంలో వున్నారు. 

అమ్మానాన్నలు లేని విద్యా కుసుమం రచన..

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి  చెందిన రుద్ర రచనకి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఇప్పుడు తన ఆలనాపాలనా అక్కా బావలు చూసుకుంటున్నారు. పదవ తరగతి వరకు స్ధానిక బాల సదనంలో ఉంటూ, జగిత్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తన పాఠశాల విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. తర్వాత హైదరాబాద్ వచ్చింది. యూసుఫ్ గూడలోని స్టేట్ హోమ్‌లో ఉంటూ పాలిటెక్నిక్ డిప్లమా పూర్తి చేసి, ప్రస్తుతం ఈ సెట్‌లో మంచి ర్యాంకు సాధించి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో(సిబిఐటి) కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజినీరింగ్‌లో సీటు సాధించింది. అయితే ఇక్కడే ఆమె చదువు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అంత ఫీజు చెల్లించే స్థోమత ఆమె అక్కాబావలకు లేదు. 

ఈ క్రమంలో రచన పరిస్ధితిని మీడియా ద్వారా తెలుసుకున్న కేటీఆర్ వెంటనే స్పందించారు. ఈ రోజు తన నివాసానికి పిలిపించుకుని అమె చదువులకు కావలసిన పూర్తి ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హమీ ఇచ్చారు. పూర్తి శ్రద్ద విద్యపైనే పెట్టాలని కోరారు. ఈ మేరకు ఫీజులకు కావాల్సిన అర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తనలాగే రాష్ట్రంలో ఇంకా చాలామంది పేద, అనాథ విద్యార్థులు వున్నారని.. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని రచన, కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ ఆమెకు భరోసా ఇచ్చారు. రచన అక్క బావలకి అవసరమైన ఆర్థిక సాయం లేదా ఉపాధికి సంబంధించిన ఇతర సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్‌కి ఫోన్ చేసి ఆదేశించారు.

పేదరికాన్ని జయించి ఐఐటీలో సీటు సాధించిన మేకల అంజలి..

పేదరికం అడుగడుగునా వేధించినా మేకల అంజలి చదువు మీద గురి తగ్గించలేదు. బాగా చదువుకుని ఐఐటీ ఇండోర్‌లో సీటు సాధించింది. కానీ పేదరికం ఆమె గురి తప్పేలా చేసింది. వరంగల్ జిల్లా హసన్‌పర్తి గ్రామానికి చెందిన అంజలి తండ్రి రమేష్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఆయన పెద్ద కుమార్తె గతేడాది ఎంబీబీఎస్‌లో ర్యాంకు సాధించి ఉస్మానియా వైద్య కళాశాలలో సీటు పొందింది. అక్కడ ఫీజులు చెల్లించడానికి తనకున్న భూమిని అమ్మి ఆ ఫీజుల్ని చెల్లించారు. దీంతో రెండో కూతురు అంజలి విషయంలో ఫీజు కట్టడానికి చేతిలో రూపాయి లేకుండా అయిపోయింది. కుమార్తె ఐఐటీ ఇండోర్‌లో సీటు సాధించినప్పటికీ ఏం చెయ్యాలో తోచక రమేశ్ సతమతమయ్యారు.

తండ్రి బాధను, తాను ఐఐటిలో సీటు పొందిన విషయాన్ని మంత్రి కేటీఆర్‌కి అంజలి ట్విటర్ ద్వారా తెలియజేసింది. ట్విటర్‌లో వెంటనే స్పందించారు కేటీఆర్. ఈరోజు అంజలిని తన నివాసానికి పిలుచుకుని ఐఐటి ఫీజులకు అవసరం అయిన అర్ధిక సహాయం అందించారు. భవిష్యత్తులో తాను సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తానని ఈ సందర్భంగా కేటీఆర్‌కి అంజలి తెలిపారు. తన కూతురి ఫీజుల కోసం ఆర్థిక సాయం అందించిన కేటీఆర్‌కి అంజలి తండ్రి రమేష్ ధన్యవాదాలు తెలిపారు.