KTR fires on the Center for not allocating bulk drug industry to telangana
mictv telugu

మమ్మల్ని కాదని వాళ్లకి ఎలా ఇస్తారు : కేంద్రంపై కేటీఆర్ ఫైర్

September 3, 2022

కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. దేశంలోనే ఫార్మా హబ్‌గా ఉన్న తెలంగాణను కాదని కేవలం మూడు రాష్ట్రాలకే బల్క్ డ్రగ్ పార్కులను కేటాయించారని విమర్శించారు. తెలంగాణపై మోదీ వివక్ష కొనసాగిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. బల్క్ డ్రగ్ పార్క్ కోసం కొన్నేళ్ళుగా ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారి ప్రయత్నించామని, ఫార్మాసిటీలో 2 వేల ఎకరాలు కేటాయించేందుకు సిద్ధమని తెలిపామన్నారు. అంతేకాక, ఫార్మాసిటీ మాస్టర్ ప్లాన్ కూడా ఇచ్చామని గుర్తు చేసుకున్నారు. అన్ని సౌకర్యాలతో రెడీగా ఉన్న తెలంగాణకు అవకాశం ఇవ్వకపోవడం షాక్‌కు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ వంటి మూడు రాష్ట్రాలకే పరిశ్రమలను కేటాయించడం అన్యాయమని వాపోయారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళ్తున్న హైదరాబాదును కేంద్రం కావాలనే విస్మరించిందని దుయ్యబట్టారు. కాగా, ఏపీకి కేటాయించిన బల్క్ డ్రగ్ పరిశ్రమ కాకినాడలో ఏర్పాటు కానుంది. రెండు వేల ఎకరాల్లో, సుమారు రూ. 6,940 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చే అవకాశముంది. అలాగే 10 నుంచి 12 వేల మందికి ఉపాధి లభించబోతోంది. అటు తెలంగాణలోని ఫార్మాసిటీని దసరా వరకు ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి.