హరీశ్, కేటీఆర్.. ఇద్దరూ కలసి సమీక్షించారు.. - MicTv.in - Telugu News
mictv telugu

హరీశ్, కేటీఆర్.. ఇద్దరూ కలసి సమీక్షించారు..

March 22, 2018

సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్న తెలంగాణ సర్కారు కేంద్ర సాయం కోసం ఎదురుచూడకుండా ముందుకెళ్తోంది. పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అధికారులకు ఆదేశాలిస్తూ వెళ్తోంది. గురువారం భారీ నీటిపారుదల శాఖ, పరిశ్రమల శాఖ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు సంయుక్తంగా సమీక్ష నిర్వహించడం ఆసక్తి రేకెత్తించింది. సిరిసిల్ల జిల్లాలోని అప్పర్ మానేరు ప్రాజెక్టును కాళేశ్వరం పరిధిలోకి తీసుకు రావాలని ఈ భేటీలో నిర్ణయించారు.

నాలుగు ప్యాకేజీలకు చెందిన టన్నెల్స్, పంప్ హౌజ్‌లు, సర్జ్ పూల్, మెయిన్ కేనాల్స్,డిస్ట్రిబ్యూటరీలు ఇతర పనులను వారు సమీక్షించారు. మెడిగడ్డ, అన్నారం,సుందిళ్ళ బ్యారేజ్ లు,పంప్ హౌజ్ల పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నట్టుగానే మిగతా ప్యాకేజీల పనులు కూడా అదే వేగంతో జరగాలని, గడువులోగా వాటిని పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు.

2.2 టి.ఎం.సి.ల సామర్థ్యమున్న అప్పర్ మానేరు ప్రాజెక్టు (నర్మాల)లో పూడికతీతకు చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. నర్మాలకు వెళ్లే కాలువలకు 38 కోట్లతో మరమ్మతులు చేస్తామని హరీశ్ రావు చెప్పారు. కాళేశ్వరం ప్యాకేజీ 9 పనులను వచ్చే దసరా నాటికి,  అక్టోబర్ 19 కల్లా పూర్తి చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన 9,10,11,12 ప్యాకేజీల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రులు స్పష్టం చేశారు. ఎలాంటి అలసత్వం, జాప్యం కుదరదని హరీస్ రావు, కేటీఆర్ స్పష్టం చేశారు. పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని హరీశ్ రావు, కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, అన్ని ప్యాకేజీల పనులు శరవేగంగా పూర్తి చేయాలని కోరారు. వానాకాలం కాళేశ్వరం నుంచి సాగునీటిని సరఫరా చేసేందుకు మూడు షిఫ్టులలో యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నట్టు హరీశ్ రావు తెలిపారు.

ఇకపై ప్రతి గంట, ప్రతి రోజూ కీలకమేనని ఆయన అన్నారు. ప్రధాన కాలువతో పాటు డిస్ట్రిబ్యూటరీల పనులు కూడా ఏక కాలంలో జరగాలని కోరారు. సమీక్షలో ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేష్, రసమయి బాలకిషన్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఈ.ఎన్. సి.మురళీధర్ రావు,సి. ఈ.హరిరాం, రిటైర్డ్ ఈ.ఎన్. సి.విజయప్రకాశ్,లిఫ్టుల సలహాదారు పెంటారెడ్డి ,వివిధ కాంట్రాక్టు ఏజన్సీ ల ప్రతినిదులు పాల్గొన్నారు.