కేటీఆర్ చొరవతో తెలంగాణ వాసికి విముక్తి.. రంజాన్ తర్వాత.. - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్ చొరవతో తెలంగాణ వాసికి విముక్తి.. రంజాన్ తర్వాత..

May 10, 2019

బతుకుదెరువు కోసం అబుదాబి వెళ్లి అక్కడ నరకం అనుభవిస్తున్న తెలంగాణ వాసి వీరయ్యకు విముక్తి లభించనుంది. తాను యజమాని వద్ద నిత్యం నరకం అనుభవిస్తున్నానని ఓ వీడియో పోస్ట్ చేయగా, అది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చేరిన విషయం తెలిసిందే. ఆయనను విడిపించి భారత్‌కు రప్పించేలా చూడాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, యూఏఈలో భారత రాయబారిని కేటీఆర్ కోరారు. కేటీఆర్ ట్వీట్‌కు యూఏఈ భారత రాయబారి నవదీప్ సూరి సైతం స్పందించారు. రియాద్‌లోని ఎంబసీ సదరు వ్యక్తి అంశాన్ని పరిశీలిస్తుందని తెలిపారు. కేటీఆర్ చొరవతో ఎట్టకేలకు ఆ వ్యక్తికి విముక్తి లభిస్తోంది.

కరీంనగర్ జిల్లా తుమ్మాపురం మండలానికి చెందిన వీరయ్య తన తల్లి చనిపోయినా స్వదేశానికి రాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. వీడియోలో అతని బాధ చూసి చలించిపోయారు కేటీఆర్. వీరయ్య ఎక్కడ ఉంటున్నదీ కనుగొన్నారు. ఓ ఎడారిలో ఒంటెల నడుమ కనిపించిన వీరయ్యను కలిసి అతడి నుంచి వివరాలు సేకరించారు అక్కడి అధికారులు. వీరయ్యను స్వదేశానికి పంపేందుకు యజమాని కూడా ఎట్టకేలకు అంగీకరించాడు. రంజాన్ తర్వాత వీరయ్య భారత్‌కు రానున్నాడు. ఈ క్రమంలో రియాద్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయ అధికారులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. కేటీఆర్ చొరవను చాలామంది నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.