కేంద్రంపై  కాలు దువ్వుతున్న కేటీఆర్...! - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రంపై  కాలు దువ్వుతున్న కేటీఆర్…!

August 14, 2017

ఇప్పటికే జి ఎస్ టి పై తమ వ్యతిరేక గళాన్ని వినిపించిన గులాబీ దండు, ఇప్పుడు ఐటిఐఆర్ ప్రాజెక్టుకు జరుగుతున్న అన్యాయంపై లేఖను సంధించింది.ఈ రెండింటికీ కేంద్రం కేటీఆర్ యే.జిఎస్ టి కౌన్సిల్ మీటింగ్ కి రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన కేటీఆర్ తమ విధానాన్ని కుండ బద్దలు కొట్టినట్టు కేంద్రం ముందు ఉంచారు.అయితే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టుకు వెంటనే నిధులు విడుదల ఆయన తన కలానికి పని చెప్పారు.ప్రాజెక్టుకు నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని లేఖను సంధించారు.ఈ మేరకు కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు తన లేఖను మంత్రి కేటీఆర్ పంపారు.

ప్రాజెక్టుకు అనుమతిచ్చి నాలుగేండ్లయినా నామమాత్రపు నిధులనే విడుదల చేశారని, ఈ జాప్యంతో ప్రాజెక్టుపైనే అనుమానాలు రేకెత్తుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు జాతీయ సగటుకన్నా అధికంగా ఉన్నాయని, సర్కారు తీసుకొచ్చిన కొత్త సంస్కరణలతో అంతర్జాతీయస్థాయి కంపెనీలు సైతం హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయని వివరించారు. 2013 సెప్టెంబర్‌లో ప్రతిష్ఠాత్మక ఐటీఐఆర్ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతిచ్చినా.. ఇప్పటివరకు నామమాత్రపు నిధులనే విడుదల చేశారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టు జాతీయస్థాయిలో ఆసక్తి రేకెత్తించింది. కానీ నాలుగేండ్లలో కేంద్రం నుంచి సరైన మద్దతు లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారయింది. కేంద్రానికి ఈ ప్రాజెక్టుపై స్పష్టత లేకపోవడం వల్ల అనేక అనుమానాలు నెలకొన్నాయి.

వీటివల్ల గందరగోళం తలెత్తింది. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై విధానపరమైన స్పష్టత ఇవ్వడంతోపాటు ఇప్పటికే ప్రాజెక్టులో భాగంగా నాలుగేండ్ల కిందట ఆమోదించిన నిధులను వెంటనే విడుదల చేయండి అని మంత్రి కేటీఆర్ లేఖలో కోరారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు 2008లో కేంద్రం వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఐటీఐఆర్లను మంజూరుచేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మౌలిక వసతుల కల్పనకు అవసరమైన వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) ఇవ్వాల్సి ఉంది. ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లోని 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐటీఐఆర్ చేపట్టాలని తెలంగాణ ఐటీ శాఖ 2010లోనే ప్రతిపాదన చేసింది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్‌ను మంజూరుచేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీఐఆర్ డీపీఆర్‌ను రెండుసార్లు కేంద్రానికి సమర్పించాం. మౌలిక వసతుల కల్పనకు రెండుదశల్లో రూ.4,863 కోట్లు సాయంచేయాలని ఐటీశాఖ కోరింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించి కేంద్రం రూ.3,275 కోట్లు (మొదటిదశలో రూ.165 కోట్లు, రెండోదశలో రూ .3,110 కోట్లు) మంజూరు చేస్తామని తెలిపింది. ఇప్పటికే అనేకసార్లు విజ్ఞప్తిచేసినా పూర్తిస్థాయి నిధుల విడుదల కాలేదు. నేను స్వయంగా కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసి ఐటీఐఆర్‌కు సహకరించాల్సిందిగా కోరాను అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఐటీ, అనుబంధ రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని సైతం అందులో వివరించారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు.. జాతీయ సగటు కన్నా అధికంగా ఉన్నాయని, 2016-17 సంవత్సరానికి జాతీయ సగటు కన్నా నాలుగు శాతం అధికంగా ఐటీ ఎగుమతులను రాష్ట్రం చేసిందని లేఖలో తెలిపారు. గత మూడేండ్లలో ఐటీరంగంలో ప్రత్యక్ష ఉపాధి 3,23,396 మంది నుంచి 4,31,891 మందికి పెరిగిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ విధానం ద్వారా ప్రపంచ ప్రసిద్ధ సంస్థలైన గూగుల్, యాపిల్, అమెజాన్, సేల్స్‌ఫోర్స్ వంటి అత్యుత్తమ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయని కేటీఆర్ లేఖలో వివరించారు. ఇలా తెలంగాణ దేశంలోనే పెట్టుబడులకు అనువైన కేంద్రంగా మారిందని చెప్పారు. మరోవైపు ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ దూసుకుపోతున్నదని, దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్‌ను ఏర్పాటుచేశామని, దీన్ని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ గత ఏడాది స్వయంగా సందర్శించి, స్టార్టప్‌లపై ప్రశంసలు కురిపించారని గుర్తుచేశారు. తెలంగాణ యువతకు వృత్తి నైపుణ్యం అందించడానికి టాస్క్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఐటీ పరిశ్రమ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నదని వివరించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తే రాష్ట్రంలో పరిశ్రమల ప్రగతి మరింత ముందుకు పోతుందన్నారు. హైదరాబాద్ నగరానికి మరిన్ని పెట్టుబడులు వస్తే, యువతకు ఉద్యోగాలు వస్తాయని, తద్వారా దేశ ఆర్థిక ప్రగతికి ఇది తోడ్పడుతుందని మంత్రి కేటీఆర్ తన లేఖ ద్వారా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.