కేటీఆర్‌ తన అర్హతకు మించి మాట్లాడారు - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్‌ తన అర్హతకు మించి మాట్లాడారు

March 1, 2018

ఆలీబాబా 40 దొంగలు అన్నట్టుగా జానా బాబా 40 దొంగలు వీళ్ళు. వీళ్లందరిపై కేసులు ఉన్నాయి’ అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎల్పీ నేత జానారెడ్డి ఘాటుగా స్పందించారు. ‘కేటీఆర్ వంటి వారిపై కౌంటర్ ప్రెస్‌మీట్ పెట్టడమంటే నా స్థాయిని తగ్గించుకున్నట్లే అవుతుంది. కానీ అన్యాయమైన ఆరోపణలు చేశారు కనుక స్పందిస్తున్నాను. అతనిపై ఇదే నా చివరి ప్రెస్ మీట్..’ అని గురువారం అసెంబ్లీ మీడియా హాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అన్నారు.‘కేటీఆర్ అతని అర్హతకు మించి మాట్లాడారు… టీఆర్‌ఎస్ వాళ్లపైనా కేసులు ఉన్నాయి కదా. శిక్షలు వేసుకోండి. కేటీఆర్ అధికారగర్వంతో హేళనగా…కుసంస్కారంగా…అర్థంపర్థం లేని సందర్భాల్లో మాట్లాడుతున్నారు.  తన స్థాయిని మించిన వాళ్లపై మాట్లాడితే తన స్థాయి పెరుగుతుందనుకుంటున్నారు’ అని మండిపడ్డారు.

తాము ప్రజలకు చెప్పింది చేశామని, మరి టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘నేను లక్ష 70 వేల ఎకరాల ఆయకట్టు ఇరిగేషన్ ప్రాజెక్టులతో నీళ్లందించేలా చేశాను. పాలేరుకట్ట మీద వేసిన శిలాఫలకంలో నాపేరుంటది కావాలంటే చూస్కో. సిరిసిల్ల, సిద్దిపేట, ఎల్లారెడ్డి, ముధోల్‌ల ప్రాజెక్టులకే కూడా నిధులను నేను మంజూరు చేశా. కృష్ణా నీటిని తెచ్చి హైదరాబాద్‌కు నీటి కటకట లేకుండా చేసింది కాంగ్రెసే. పునాదులేసి… ఎవరో ఇల్లు కట్టిన తర్వాత…దాని’ పై పెంట్‌హౌస్ వేసి…చూసినవా నేను కట్టిన ఇల్లు ఎట్లున్నది అన్నట్లుంది కేటీఆర్ ధోరణి’ అని జానా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.