గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తేదీలపై మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రస్తావించినట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. బుధవారం తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాను అనని మాటలను తనకు ఆపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు కావాలనే పనిగట్టుకొని వార్తలు రాశాయని మండిపడ్డారు.
ఎన్నికల షెడ్యూల్ మరియు నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమీషన్ పరిధిలోని అంశం. సదరు మీడియా సంస్థలు నేను అనని మాటలను నాకు ఆపాదించడం జరిగింది. 2/2
— KTR (@KTRTRS) September 30, 2020
మంత్రి కేటీఆర్ నవంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయని పార్టీ శ్రేణులకు చెప్పినట్టుగా వార్త కథనాలు వచ్చాయి. ఎన్నికల సంఘం కంటే ముందే ఎలా చెబుతారని, ఆయన ఆధీనంలోనే నడుస్తున్నాయా అంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం నవంబర్ రెండవ వారం తర్వాత ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని మాత్రమే తాను చెప్పానని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్, నిర్వహణ అంతా ఎన్నికల సంఘం పరిధిలోనిదేనని స్పష్టం చేశారు. లేని మాటలను ఆపాధించవద్దని కోరారు.