KTR ordered the Ikea store to apologize to the victims
mictv telugu

జాత్యాహంకార వ్యాఖ్యలు.. ఐకియా స్టోర్ క్షమాపణకు కేటీఆర్ ఆదేశం

August 29, 2022

KTR ordered the Ikea store to apologize to the victims

ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నీచర్ అమ్మకాల సంస్థ ఐకియా హైదరాబాద్ స్టోర్ వివాదంలో చిక్కకుంది. ఐకియా సిబ్బంది జాత్యాహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డారని ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కేటీఆర్.. బాధితుడికి క్షమాపణలు చెప్పాలని ఐకియా స్టోర్‌ను ఆదేశించారు. తెలంగాణలో ఇలాంటి వాటికి సహించేది లేదని మండిపడ్డారు.

వివరాల్లోకెళితే.. జర్నలిస్టుగా పనిచేస్తున్న నితిన్ సేథి ఆదివారం తన భార్య మణిపూర్‌కు చెందిన అకోలిజం సునీతతో గచ్చిబౌలిలోని ఐకియా స్టోర్‌కి షాపింగుకు వచ్చారు. కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసి తిరిగి వెళ్తుండగా, కౌంటర్ వద్ద సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని బాధితురాలు ట్విట్టర్‌లో ఇలా పోస్ట్ చేసింది. ‘ఈ రోజు హైదరాబాద్ ఐకియా స్టోర్ సిబ్బంది నేను మాత్రమే కొనుగోలు చేసిన వస్తువులను ఒక్కొక్కటిగా తనిఖీ చేశారు. సిబ్బంది ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఇది జాత్యాహంకారం కాకపోతే మరేంటీ? అదీకాక, పేరుతో పిలిచి అవమానించారు. ఐకియా ఇలాంటి సిబ్బంది ప్రవర్తనను సమర్ధిస్తుందా? అని ప్రశ్నించారు. దీనిపై ఆమె భర్త నితిన్ కూడా మద్ధతుగా నిలిచారు. మరో ట్వీట్‌లో ‘నా భార్య షాపింగ్ బ్యాగులను తనిఖీ చేసిన వ్యక్తి ఈ వస్తువులను మేం కూడా కొన్నాం అంటూ నవ్వాడు. మమ్మల్ని ఒంటరిగా నిలబెట్టి తర్వాత పట్టించుకోలేదు. అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సూపర్ వైజర్లు కావాలంటే పోలీసులను పిలుచుకోండి. మేం వారితో మాట్లాడతాం అంటూ పొగరుగా మాట్లాడారు. ఇది ఇంతటితో అయిపోలేదు. ప్రజలు రోజూ ఎదుర్కొంటున్న జాత్యాహంకారం’ అంటూ వివరించారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో కేటీఆర్ స్పందించి వెంటనే ఆ దంపతులకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. కస్టమర్లతో ఎలా మాట్లాడాలో సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. దీంతో స్పందించిన ఐకియా యాజమాన్యం.. ‘స్టోర్‌ల వద్ద సమానత్వం మానవ హక్కుగా భావిస్తాం. ఇక్కడ జాత్యాహంకారం, పక్షపాతాలకు చోటులేదు. బాధితులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా’మంటూ బదులిచ్చింది.