ktr phone call to munugode bjp leader video viral
mictv telugu

బీజేపీ సర్పంచ్‌కు మంత్రి కేటీఆర్ ఫోన్.. అసలిది నిజమేనా?

October 19, 2022

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సంబందించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. బీజేపీ కి చెందిన ఓ సర్పంచ్ కు మంత్రి ఫోన్‌ చేసి, మునుగోడు ఉపఎన్నికలలో తమ పార్టీ అభ్యర్ధి గెలిపించేందుకు సహకరించాలని, టీఆర్ఎస్ లో చేరాలని అభ్యర్ధించినట్లు ఓ ఫోన్ కాల్ రికార్డ్ వాట్సాప్ లో చక్కర్లు కొడుతోంది. కేటీఆర్‌ ఉపఎన్నికలకు ముందు ఇటువంటి రాజకీయ తప్పిదం చేసారంటే నమ్మశక్యంగా లేదు. కానీ ఆయన ఫోన్‌ చేసి మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు వారి సంభాషణను రికార్డ్ చేసి మీడియాలో పెట్టేయడంతో అది నిజమా కాదా? అన్న సందేహంలో ఉన్నారంతా. “గట్టుప్పల్ నియోజకవర్గంలో మంచి పలుకుబడిన నేతగా మీకు మంచిపేరుందని మావాళ్లు చెపితేనే నేను మీకు ఫోన్‌ చేశాను.

 

మీరు ఈ ఉపఎన్నికలలో మాకు సహకరిస్తే ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాము. మేము ఏదో డొల్ల మాటలు చెప్పి మీ సాయం కోరడం లేదు. మీ నియోజకవర్గంలో 79 వేల మందికి రైతుబంధు, 43 వేలమందికి పెన్షన్లు వస్తున్నాయి. మీ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీ పార్టీవాడు కాడు. ప్రధాని నరేంద్రమోడీ మీద ఆయనకు ఎటువంటి గౌరవం కూడా లేదు. ఆయన సంగతి మాకంటే మీకే బాగా తెలుసు. ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆయన చేసిందేమీ లేదు. మేము ఈ ఉపఎన్నికలలో ఓడిపోయినానంత మాత్రాన మా ప్రభుత్వం పడిపోదు… అతను గెలిచినంత మాత్రాన తెలంగాణలో మీ ప్రభుత్వం అధికారంలోకి రాదు.

కనుక దయచేసి ఈ ఉపఎన్నికలలో మా పార్టీ అభ్యర్ధిని గెలిపించుకొనేందుకు మీరు కాస్త మాకు సాయం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను,” అని జగన్నాథాన్ని కేటీఆర్‌ కోరుతున్నట్లు ఈ వీడియోలో ఉంది. అయితే, దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఫోన్ కాల్ రికార్డ్ ఆడియోపై బీజేపీ నేతలు కేటీఆర్‌కు, టిఆర్ఎస్‌కు చురకలు వేయడం మొదలుపెట్టారు. స్థానిక బీజేపీ నాయకుల్ని మంత్రి కేటీఆర్ ఫోన్‌లో ప్రాధేయపడటం చూస్తుంటే ఇదంతా ఫేక్ న్యూస్, వాయిస్ డబ్బింగ్ అంటూ టీఆర్ఎస్‌ శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. బీజేపీ నేతలు మాత్రం టీఆర్ఎస్‌ ఓటమి భయంతో జిమ్మిక్కులు చేస్తున్నారని, ఏకంగా కేటీఆర్ రంగంలోకి దిగి రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.