ఆ నాటకాలు తెలంగాణలో సాగవు.. బీజేపీకి కేటీఆర్ వార్నింగ్
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డా చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. కర్ణాటకలో నాటకాలు చేసినట్టు తెలంగాణలో చేస్తే కుదరదని హెచ్చరించారు. కూకట్‌పల్లిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘జేపీ నడ్డా కాదు అబద్దాల అడ్డా. బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలనే కేంద్రం కాపీ కొడుతోంది. బీజేపీ చేసే అసత్య ప్రచారాలను తెలంగాణ బిడ్డలు నమ్మరు. మా ప్రభుత్వంపై చేస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపించాలి. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులంతా వచ్చి తెలంగాణలో ప్రచారం చేసినా ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలిచిందో లెక్కవేసుకోవాలని సూచించారు’.
ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు కేటీఆర్. బీజేపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జేపీ నడ్డా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు సందించారు. వాటిని టీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొడుతున్నారు.