KTR replied that the staff who did not know Hindi and English changed the seat
mictv telugu

హిందీ, ఇంగ్లీషు రాదని, సీటు మార్చిన సిబ్బంది..స్పందించిన కేటీఆర్

September 19, 2022

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. రాజకీయం పరంగా, సామాజిక సేవల పరంగా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా విమానంలో ప్రయాణం చేస్తున్నా, తెలుగు మహిళ పట్ల విమాన సిబ్బంది ప్రవర్తించిన తీరుపై, అసహనం వ్యక్తం చేస్తూ, కేటీఆర్ చేసిన ఓ ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హిందీ, ఇంగ్లీషు రాదని, విమాన సిబ్బంది తెలుగు మహిళను ముందు సీటు నుంచి వెనక సీటుకు మార్చటం పట్ల ఆయన మండిపడ్డారు. ఇకపై ప్రాంతీయ భాషలు వచ్చిన వారినే సిబ్బందిగా నియమించుకోవాలని యాజమాన్యానికి ఆయన సూచించారు.

 

వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 16న ఓ మహిళా ప్రయాణికురాలు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో వస్తుండగా, ఆమెకు ఇంగ్లీష్/హిందీ రాదన్న కారణంతో విమాన సిబ్బంది..ఆమె కూర్చున్న సీట్లోంచి తీసుకెళ్లి, మరో చోట కూర్చోబెట్టారు. ఈ ఘటనను అహ్మదాబాద్ ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవస్మిత తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘2ఎ సీట్లో ఎగ్జిట్ డోర్ దగ్గర కూర్చున్న సదరు మహిళకు హిందీ/ఇంగ్లిష్ రాదని, అది తెలుసుకొని విమాన సిబ్బంది ఆ మహిళను 3సి సీట్లోకి మార్చేశారు. ఆ మహిళ పట్ల విమాన సిబ్బంది వివక్ష ప్రదర్శించారు” అని తెలియజేస్తూ, సదరు తెలుగు మహిళ ఫొటోను కూడా షేర్ చేశారు.

ఈ ఘటనపై కేటీఆర్ స్పందిస్తూ..”ఇకపై ప్రతి విమానంలో ఇంగ్లీషు, హిందీతోపాటు స్థానిక భాషలు మాట్లాడే సిబ్బందిని కూడా నియమించుకోవాలి. అంతేకాదు, ప్రతి విమాన యాజమాన్యం స్థానిక భాషలు మాట్లాడే ప్రతి ప్రయాణికులను గౌరవించాలి. అప్పుడే ప్రయాణికులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే ఇంగ్లిష్‌, హిందీ రానివారి సౌకర్యార్థం కోసం తెలుగు, తమిళం, కన్నడ తదితర భాషలు మాట్లాడేవారిని నియమించుకోవాలి” అని కేటీఆర్ తెలియజేస్తూ, ఇండిగో యాజమాన్యానికి ట్యాగ్ చేశారు.