కేటీఆర్ చొరవ.. ఈ చాయ్‌వాలా మళ్లీ బడికి.. - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్ చొరవ.. ఈ చాయ్‌వాలా మళ్లీ బడికి..

December 19, 2017

ట్విటర్ వేదికగా ప్రజల సమస్యలపై స్పందిస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ఒక పేద బాలుడి సమస్యను తీర్చారు. ఆర్థిక పరిస్థితి బాగోలేక బడిమానేసి, టీ అమ్ముతున్న 15 ఏళ్ల కుర్రాడిని తిరిగి బడి బాట పట్టించారు.

బంజారాహిల్స్ లోని సింగిడి బస్తీకి చెందిన  15 ఏళ్ళ సమీయుద్దీన్ ఫైజాన్ ప్రైవేట్ స్కూల్లో చదివేవాడు. ఫీజుల భారం వల్ల బడి మానేసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో సిటీ సెంటర్ మాల్ వద్ద కొన్ని రోజులుగా  టీ అమ్ముతున్నాడు. ఈ విషయాన్ని రియాజుద్దీన్ అనే స్థానికుడు ట్విటర్  ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళాడు.

మీయుద్దీన్ టీ అమ్ముతున్న ఫోటోను కూడా ట్వీట్ చేశాడు. దీనిపై మంత్రి వెంటనే స్పందించారు. బాలుడిని తిరిగి స్కూల్లో చేర్పించాలని, అతడి బాల్యం ఇలా రోడ్డుపాలు కావొద్దని  అధికారులను ఆదేశించారు. వారు సమీని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించడానికి సన్నాహాలు ప్రారంభించారు. సమీ తండ్రి అజీజ్ కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. రేపోమాపో సమీ బడికి వెళ్లనున్నాడు.