బావురుమన్న బాల్యం.. చలించిన కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

బావురుమన్న బాల్యం.. చలించిన కేటీఆర్

December 5, 2017

పిల్లలపై చదువుల భారం గురించి ఎంత చెప్పినా తక్కువే. బండెడు పుస్తకాల మోత బరువు, గంటలకొద్దీ ట్యూషన్లు, ఊపిరి కూడా తీసుకోనివ్వని హోంవర్కులు.. వీటి ధాటికి పసి మనసులు ఆటాపాటలన్నదే ఎరగక చితికిపోతున్నాయి. మనోవికాసం లేక యాంత్రికంగా మారిపోతున్నారు. దీనిపై ఒక విద్యార్థి.. ఐటీ మంత్రి కేటీఆర్‌కు ట్విటర్లో తన బాధను వివరించి, ఆదుకోవాలని ఆర్తిగా అభ్యర్థించాడు. దీనికి కేటీఆర్ చలించిపోయాడు.. ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

అభిజీత్ కార్తీక్ అనే విద్యార్థికి ఈ ట్వీట్ చేశాడు. ‘సర్.. నా పేరు అభి. కేపీహెచ్‌బీలోని నారాయణ టెక్నో స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను.. మా స్కూల్ టైమింగ్స్ పొద్దున 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు. దీనికి తోడు సోమవారం ఐఐటీ ఓరియంటేషన్ ఎగ్జామ్ భారం కూడా ఉంది. వీటి వల్ల మేం ఆదివారాల్లో విశ్రాంతి కోల్పోతున్నాం. సర్ మీరు కఠిన చర్యలు తీసుకుని, మా బాల్యాన్ని కాపాడండి.. ’ అని కోరాడు.

దీనికి కేటీఆర్ వెంటనే స్పందించారు. ‘నీ బాధను నేను పంచుకుంటున్నాను అభి. పాఠశాల విద్యామత్రి కడియంశ్రీహరి గారి దృష్టికి సాధ్యమైనంత త్వరగా ఈ విషయాన్ని తీసుకెళ్తాను..’ అని ట్వీట్ చేశారు.