KTR tweeted to Modi
mictv telugu

గోద్రా రేపిస్టులకు బెయిల్.. మోదీకి కేటీఆర్ ట్వీట్

August 17, 2022

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులను రెమిషన్ ఆదేశాల కింద విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలు విమర్శలు మామూలే అనుకున్నా మేధో వర్గం, సాధారణ పౌరులు కూడా గుజరాత్ ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని ఘాటుగా విమర్శిస్తున్నారు. తమ నిర్ణయాన్ని గుజరాత్ ప్రభుత్వం సమర్ధించుకోవడం మరింత వివాదాస్పదమైంది. ఈ క్రమంలో తెలంగాణ మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఏకంగా ప్రధానమంత్రికే ట్విట్టర్‌లో రిక్వెస్ట్ చేశారు. ‘ప్రియమైన ప్రధాని మోదీ గారు.. మహిళల గౌరవం గురించి మీరు మాట్లాడడం నిజమైతే ఈ విషయంలో జోక్యం చేసుకోండి. పదకొండు మంది రేపిస్టులను విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వ ఆదేశాలను రద్దు చేయించండి. ఈ చర్య వెగటు పుట్టించేలా ఉంది. మీరు కల్పించుకొని మీ చిత్తశుద్ది చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే ఐపీసీ, సీఆర్‌పీసీ నిబంధనల్లో మార్పులు చేయండి. రేపిస్టులను బెయిల్ దొరక్కుండా ఉండేందుకు చట్టంలో సవరణలు చేయాలి. బలమైన చట్టాలతో న్యాయ వ్యవస్థ పటిష్టంగా, మరింత వేగంగా పనిచేస్తుంది’ అని వరుస ట్వీట్లు చేశారు. కాగా, దోషులు విడుదలైనప్పుడు స్వీట్లు పంచడం, పాలాభిషేకాలు చేయడం వంటి చర్యలు వైరల్‌గా మారాయి.