మజ్లిస్ నేతకు కేటీఆర్ వార్నింగ్.. ఎందుకంటే? - MicTv.in - Telugu News
mictv telugu

మజ్లిస్ నేతకు కేటీఆర్ వార్నింగ్.. ఎందుకంటే?

April 6, 2022

01

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరం భోలక్‌పూర్‌లో సోమవారం అర్థరాత్రి కూడా దుకాణాలను తెరిచి ఉంచారు వెంటనే మూసివేయాలని దుకాణాదారులను స్ధానిక పోలీసులు కోరారు. దీంతో కొంతమంది దుకాణాదారులు రంజాన్ పండగ మొదలైంది కాబట్టి అందుకే దుకాణాలను తెరిచి ఉంచామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్, మరికొంతమంది పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. అయితే, ఈ ఘటనకు కారణం అయిన వారిపై, దురుసుగా ప్రవర్తించిన కార్పొరేటర్‌పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని బుధవారం డీజీపీని కేటీఆర్ ట్విటర్ ద్వారా కోరారు.

 

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుకాణాలను బంద్ చేయాలని చెప్పడానికి వెళ్లిన పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ దుర్భాషలాడాడు. దుకాణాలను మూసివేయించేందుకు వెళ్లిన తమను అడ్డుకున్నాడని తెలిపారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 

ఆ వీడియోలో.. “రంజాన్ మాసంలో తెల్లవార్లూ హోటళ్లు తెరిచే ఉంటాయి. నిర్వాహకులను ఇబ్బంది పెట్టకండి. పోలీసులు తమాషాలు చేస్తున్నారు. తమ డ్యూటీ తాము చేసుకొని వెళ్లిపోవాలి” అని కార్పొరేటర్ అంటున్నట్లు వీడియోలో ఉంది. తమ డ్యూటీ తాము చేస్తున్నామని ఓ కానిస్టేబుల్ అనగానే “రూ. 100 వ్యక్తివి నువ్వు, నాకు సమాధానం చెబుతావా? మీ ఎస్సైని పిలిపించు, కార్పొరేటర్ వచ్చాడని చెప్పు” అంటూ ఆయన దురుసుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ కేటీఆర్‌కు ట్వీట్ చేస్తూ కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

దీంతో కేటీఆర్ వెంటనే స్పందించారు. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వాళ్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇలాంటి చర్యలను ఉపేక్షించవద్దని.. రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.