తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అందులో డేటా సెంటర్ల విషయంలో హైదరాబాద్ సాధించిన పురోగతిని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలు తమ డేటా సెంటర్లను నగరంలో ఏర్పాటు చేస్తున్నాయని, భూకంపాల ప్రమాదం తక్కువగా ఉండడం, వాతావరణ అనుకూలతలు వంటి సానుకూల అంశాలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో డేటా సెంటర్ల ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతికూలతలు ఉన్న గుజరాత్‌లో డేటా ఎంబసీల ఏర్పాటుతో సమస్యలు వస్తాయని తెలిపారు. ఒకే ప్రాంతంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం, అదీ అంతర్జాతీయ సరిహద్దు కలిగిన గుజరాత్‌ను ఎంచుకోవడం, అక్కడ గతంలో భూకంపాలు వచ్చిన చరిత్ర ఉండడాన్ని గుర్తు చేశారు. ఈ దృష్ట్యా గుజరాత్ రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటు అత్యంత ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. అన్ని అర్హతలు ఉన్న హైదరాబాద్ నగరంలో ఇంటర్నేషనల్ డేటా ఎంబసీ ఏర్పాటు చేయాలని కోరారు.