ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శోభానాయుడు (58 ) కన్నుమూశారు. అనారోగ్యంతో ఉన్న ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ బుధవారం ఉదయం చనిపోయారు. ఈ విషయం తెలిసిన పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆమె శిష్యులు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు.
కూచిపూడి నాట్య కళాకారిణిగా శోభానాయుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో స్టేజీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు జన్మించారు. వెంపటి చిన సత్యం వద్ద శిష్యరికం చేశారు. ఎన్నో జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారు. ఆమె ప్రతిభకు 2001లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించారు. హైదరాబాద్లో కూడా ఆమె కూచిపూడి ఆర్ట్స్ అకాడమీని స్థాయింపించారు. దాదాపు 40 సంవత్సరాలుగా ఎంతో మందికి శిక్షణ ఇస్తూ వస్తున్నారు.