దేవరగట్టులో కర్రల సమరం.. పదుల సంఖ్యలో గాయాలు! - MicTv.in - Telugu News
mictv telugu

దేవరగట్టులో కర్రల సమరం.. పదుల సంఖ్యలో గాయాలు!

October 27, 2020

vijayadashami

కర్నూలు జిల్లా దేవరగట్టులో ఈసారి కూడా బన్నీ ఉత్సవం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం బన్నీ ఉత్సవాన్ని నిషేధించిన సంగతి తెల్సిందే. అయిన కూడా భక్తులు దేవరగట్టు చేరుకుని కర్రల సమరంలో పాల్గొన్నారు. ఆంక్షలను బేఖాతర్ చేస్తూ నెరణికి, నెరణికి తండా, సుళువాయి, కొత్తపేట గ్రామాల ప్రజలు దేవరగట్టుకు చేరుకుని కర్రల సమరంలో పాల్గొన్నారు. ఈ కర్రల సమరాన్ని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. 

1500 మంది పోలీసులు, 30 చెక్ పోస్టులు, 50 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినా భక్తులు కొండల మార్గం ద్వారా తరలివచ్చి బన్ని ఉత్సవంలో పాల్గొన్నారు. సోమవారం రాత్రి పదిన్నర వరకు ఎలాంటి హడావుడి లేక బోసిపోయినట్టు కనిపించిన తేరు బజారు ప్రాంతం ఒక్కసారిగా జనంతో కిక్కిరిసిపోయింది. అర్చకులు స్వామి వారికి కల్యాణం నిర్వహించి ఉత్సవ విగ్రహాలను కొండపై నుంచి కిందికి తీసుకొచ్చి సింహాసన కట్ట వద్ద ఉంచారు. అక్కడి నుంచి విగ్రహాలకు భక్తులు కర్రలు అడ్డుగాపెట్టి రాక్షసపడ వద్దకు తీసుకెళ్లారు. విగ్రహాలను చేజిక్కించుకునేందుకు జరిగిన కర్రల సమరంలో దాదాపు 50 మంది గాయపడ్డారు.